NTV Telugu Site icon

KTR Letter: దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ

Ktr

Ktr

KTR Letter: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేఖ ద్వారా సవాల్ విసిరారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తోందని లేఖలో తెలిపారు.ఈ విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయన్నారు. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకుందని కేటీఆర్ తెలిపారు.

Read Also: Kaleshwaram Commission: తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారు..

ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందన్నారు. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే వివరంగా చెప్పడం జరిగిందన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నదన్నారు. కనుక శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయన్నారు.

Show comments