సినీ పరిశ్రమలో చాలా మంది ప్రణాళికలు వేసుకుని హీరో–హీరోయిన్ గా మారుతారు. అయితే కొందరికి మాత్రం అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టేస్తుంది. అలాంటి లక్కీ ఛాన్స్‌తో కెరీర్ దొరికిన హీరోయిన్ కృతి శెట్టి. బెంగళూరులో పెరిగిన ఈ బ్యూటీ అసలు పుట్టింది మాత్రం ముంబైలో. తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి ఫ్యాషన్ డిజైనర్. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపిన కృతి, ముందుగా వాణిజ్య ప్రకటనల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అదే నిర్ణయం ఆమెను హీరోయిన్‌గా మార్చింది.
Also Read : Bigg Boss Telugu 9: 12వ వారం కెప్టెన్సీ టాస్క్‌లో ఘర్షణలు.. పవన్–రీతూ ఎమోషనల్ మోమెంట్స్ హైలైట్
చిన్న వయసులో ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కృతి శెట్టి ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా భారీ విజయంతో వరుస అవకాశాలు రాగా, తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ది వారియర్’, ‘కస్టడీ’ వంటి సినిమాల్లో నటించింది. అయితే వీటిలో కొన్ని మాత్రమే హిట్టవడంతో ఆమె క్రేజ్ కొంత తగ్గిపోయింది. దీంతో కృతీ టాలీవుడ్‌కే పరిమితం కాకుండా తమిళం, మలయాళంలో కూడా ప్రాజెక్టులు చేపట్టింది. ప్రస్తుతం తమిళంలో ‘జీనీ’, ‘వా వాద్దియార్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి ఆమె కెరీర్ మలుపు తిప్పే ప్రాజెక్టులు గా భావిస్తున్నారు. అయితే ఇటీవల ‘వా వాద్దియార్’ ప్రమోషన్‌లో పాల్గొన్న కృతీ శెట్టి, తన హీరోయిన్ జర్నీ పై ఆసక్తికర విషయాలు బయటపెట్టింది..
కృతి మాట్లాడుతూ.. ‘ఒక కమర్షియల్ యాడ్ ఆడిషన్‌కు వెళ్లాను. ఆ రోజు మా నాన్న రావడం ఆలస్యమవడంతో. ఎదురుగా కనిపించిన స్టూడియోలో అడిషన్స్ జరుగుతుంటే చూడటానికి లోపలికి వెళ్లాను. అక్కడ నన్ను చూసిన టీమ్ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉందా అని అడిగారు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వారికి మా అమ్మ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయా. కొద్ది రోజులకే దర్శకుడు బుచ్చిబాబు ఫోన్ చేసి మాట్లాడారు. అలా ‘ఉప్పెన’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాను. ఆ రోజు నాన్న టైమ్‌కి వచ్చి ఉండి ఉంటే నేను హీరోయిన్ అయ్యేదాని కాదు” అని కృతి నవ్వుతూ చెప్పింది. కార్తీ, ప్రదీప్ వంటి నటులతో పనిచేయడం సంతోషంగా ఉంది, భవిష్యత్తులో కూడా మంచి కథలు చేసే దిశగా అడుగులు వేస్తానని కృతి శెట్టి వెల్లడించింది.