Hyderabad: ఇంటి గేటు వద్ద కార్తీక దీపం.. చీరకు మంటలు అంటుకుని 18 ఏళ్ల యువతి మృతి!

Bus Died

Bus Died

Hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం ప్రమాదవశాత్తూ చీరకు అంటుకోవడంతో 18 ఏళ్ల యువతి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కేపీహెచ్‌బీ అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న సాయి వెంకట సింధు (18), రోడ్ నంబర్ 5లో ‘ఎస్ఎస్ బొటీక్’ నిర్వహిస్తోంది. రోజువారీ పనులు ముగించుకుని షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఇంటి గేటు వద్ద వెలిగించి ఉంచిన కార్తీక దీపం ఆమె చీరకు అంటుకుంది. దీంతో క్షణాల్లోనే మంటలు ఒళ్లంతా వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన సింధును కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సింధు ప్రాణాలు కోల్పోయింది. చేతికొచ్చిన యువతి ఇలా అకాల మరణం చెందడంతో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉండగా.. గత మూడు రోజుల కిందట మరో ఘటన చోటు చేసుకుంది. కార్తీక దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చాపర్ల భానుమతి అనే వృద్ధురాలు ఎస్‌ఆర్ నగర్‌లోని జగన్నాథ రెసిడెన్సీలో ఉంటున్న తన కూతురు కిన్నెర వద్ద నివాసం ఉంటున్నారు. ఈ నెల 23న రెండో కార్తీక సోమవారం సందర్భంగా ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకుంది. ఆ మంటలు కొన్ని క్షణాల్లోనే ఒళ్లంతా వ్యాపించాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పేలోపే ఆమె శరీరం దాదాపు 50 శాతంపైగా కాలిపోయింది. వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం బుధవారం ప్రాణాలు కోల్పోయారు.