దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు (One nation One Election) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధ్యాయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Kovind) నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. అయితే దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదికను కోవింద్ కమిటీ తయారు చేసింది. త్వరలోనే ఆ రిపోర్టును కేంద్రానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది.
రిపోర్టులో ఏముందంటే..
2029 నుంచి ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా నిబంధనలను మార్చే విధానాన్ని సూచించడమే కాకుండా లోక్‌సభ, అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి ఓటరు జాబితా ఉండాలని సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.
అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలతో పాటు రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. పార్లమెంటు సభల వ్యవధిపై ఆర్టికల్ 83, రాష్ట్రపతి లోక్‌సభ రద్దుపై ఆర్టికల్ 85, రాష్ట్ర శాసనసభల వ్యవధికి సంబంధించి ఆర్టికల్ 172, రాష్ట్ర శాసనసభల రద్దుపై ఆర్టికల్ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి ఆర్టికల్ 356 ఇందులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రుతురాజ్ అవస్థీ సూచనలివే..
ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ నేతృత్వంలోని న్యాయ కమిషన్ కూడా కీలక సిఫార్సులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చాలని సూచించనున్నట్లు సమాచారం. ఈ నివేదిక ప్రకారం.. దేశంలో తొలి జమిలి ఎన్నికలు 2029 మే-జూన్‌లో జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలను బట్టి తెలుస్తోంది.
మొత్తానికి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కమిటీ రిపోర్టు సిద్ధమైంది. ఈ ఏడాది జరిగే ఎన్నికలు మాత్రం యథావిధిగా జరిగిపోనున్నాయి. 2029 నుంచి మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.