Kotamreddy Sridhar Reddy: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 8 మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు వేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనిపై స్పందించిన వైసీపీ రెబల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అనర్హత వేటు వల్ల మాకు ఎలాంటి నష్టమూ లేదన్నారు.. అసలు ఈ ఎపిసోడ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. ఏడాది క్రితమే వైసీపీ మమ్మల్ని సస్పెండ్ చేసింది.. సస్పెండ్ చేసిన తర్వాత మాపై అనర్హత వేటు వేసే నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు.. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణ సరికాదని హితవుపలికారు. నియోజకవర్గ సమస్యలపై పోరాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.
Read Also: Fire Accident: గాజువాకలో భారీ అగ్నిప్రమాదం.. ఆగినట్టే ఆగి మళ్లీ ఎగసిన మంటలు..!
కాగా, వైఎస్సార్‌సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్‌కుమార్, కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక, ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని సీతారాం.. పలుమార్లు ఎమ్మెల్యేలను విచారించారు.. వారిని నుంచి వివరాలు తీసుకున్నారు.. మరికొన్ని సందర్భాల్లో విచారణ దూరంగా ఉన్నారు రెబల్ ఎమ్మెల్యేలు.. ఈ తరుణంలో విచారణ ముగిసినట్టేనని ప్రకటించిని స్పీకర్.. ఆ తర్వాత న్యాయనిపుణుల సలహా తీసుకుని.. ఒకేసారి 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినట్టు వెల్లడించిన విషయం విదితమే.