సినీ ప్రమోషన్స్ లో సమన్వయ లోపం ఒక్కోసారి ఊహించని ఇబ్బందులకు దారితీస్తుంది. తాజాగా కన్నడ చిత్రం ‘కొరగజ్జ’ బృందానికి కేరళలోని కొచ్చిలో ఇటువంటి అనుభవమే ఎదురైంది. షెడ్యూల్ పరంగా తలెత్తిన గందరగోళం కారణంగా ఈ సినిమా ప్రెస్మీట్ అర్ధాంతరంగా వాయిదా పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘కొరగజ్జ’ ప్రెస్ మీట్ కొచ్చిలోని హోటల్లో నిర్వహించాలని యూనిట్ ముందే నిర్ణయించింది. దీనికోసం వారం రోజుల ముందే మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు కూడా పంపారు. అయితే, అదే రోజు, అదే సమయానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న మరో చిత్రం ప్రెస్మీట్ కూడా షెడ్యూల్ కావడంతో సమస్య మొదలైంది.
Also Read:Sudev Nair: టాలీవుడ్’కి ఫ్రెష్ విలన్ దొరికాడోచ్
కొచ్చి సినిమా జర్నలిస్టుల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఒకే సమయంలో రెండు పెద్ద ఈవెంట్లు జరగడం వల్ల మీడియా హాజరుపై ప్రభావం పడుతుందన్న ఆందోళనతో ‘కొరగజ్జ’ బృందం తమ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ కార్యక్రమం కోసం అంతర్జాతీయ నటుడు కబీర్ బేడీ, సీనియర్ నటి భవ్య ప్రత్యేకంగా కొచ్చికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కబీర్ బేడీ మాట్లాడుతూ.. “మలయాళ చిత్ర పరిశ్రమ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ ఇలాంటి షెడ్యూల్ ఓవర్ల్యాప్లు జరగడం బాధాకరం. ఇది ఉద్దేశపూర్వకం కాకపోయినా, పీఆర్ బృందాల మధ్య సరైన కమ్యూనికేషన్ ఉంటే ఇలాంటి పరిస్థితులు రావు” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటి భవ్య కూడా స్పందిస్తూ, కళాకారుల సమయాన్ని, మీడియాకు ఇచ్చిన మాటను గౌరవించడం ముఖ్యమని పేర్కొన్నారు. పరిశ్రమలో ఒకరికొకరు సహకరించుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సమన్వయ లోపాలు తలెత్తకుండా మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని ‘కొరగజ్జ’ బృందం ఈ సందర్భంగా సూచించింది.