బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. నాపై చేసిన వ్యాఖ్యాలు సత్యదూరమైనవన్నారు రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నేను చెప్పని మాటల్ని చెప్పినట్టు అబద్ధాలు చెప్పి నాపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. మొన్నటిదాక.. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా అన్నా.. సహాయం చేయమని నన్ను అడిగిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. ఇవ్వాల నాపై కామెంట్లు చేస్తున్నాడన్నారు. నేను కాంగ్రెస్ లకి వస్తా అన్నా.. మంత్రి పదవి కావాలని అడిగిండు.. మాకే సరిపడ మెజార్టీ ఉంది. ఎవ్వరిని చేర్చుకోవాలనే ఉద్దేశం పార్టీకి లేదని చెప్పిన. అది మనసులో పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నడని, నితిన్ గడ్కరీకి, అమిత్ షా దగ్గరికి వెళ్లి ఏదో చెప్పిన్నని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’నేను మహేశ్వర్ రెడ్డికి ఒక్కటే సవాల్ చేస్తున్నా… ఆయనకు దమ్ముంటే నితిన్ గడ్కరిని, అమిత్ షాను తీసుకొని భాగ్యలక్ష్మీ టెంపుల్ కు రమ్మనండి.. నేను వస్తా ప్రమాణం చేద్దం.. ఐదేండ్లకో పార్టీ మారే.. గాలిమాటల మహేశ్వర్ రెడ్డి.. రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి జెండా మార్చని నాపై విమర్శలు చేస్తడా..? ఆయన ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, మధ్యలో బీఆర్ఎస్ తో టచ్.. ఇట్ల ఒక్కటి కాదు ఆయన పోని పార్టీ ఈ రాష్ట్రంలో లేదు.. బీజేపీ గేట్లు ఎత్తితే 48 గంటల్లో అన్ని పార్టీలు ఖాళీ అవుతాయి.. ఆరుగురు మంత్రులు మాకు టచ్ లో ఉన్నరు అంటడు.. మళ్లీ ఆయనే మేం ఎవ్వరిని చేర్చుకోవాలని ప్రయత్నించడం లేదంటడు. ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నడు. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ. ప్రపంచంలో ఎక్కడ లేనట్టు.. చేరికల కమిటీకి ఛైర్మన్ ను కూడా నియమించిన్రు.. అయినా ఒక్క కార్పోరేటర్ కూడా ఆ పార్టీలో చేరలే. ఆర్ధికంగా లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి నడిపిస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని.. ఇవ్వాల సీఎం ఢిల్లీకి డబ్బులు పంపుతాండని కామెంట్లు చేస్తున్నడు. దేశంలో 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, 4 రాష్ట్రాల్లో పొత్తులో అధికారంలో ఉంది. మరీ ఆయా రాష్ట్రాల నుంచి నరేంద్రమోదీకి, నడ్డాకు డబ్బుల మూటలు పంపిస్తున్నరా..? ఈ దేశంలో అంబానీ, అదానీలకు ప్రజల సంపదను దోచిపెట్టే బీజేపీ వేరేపార్టీలను విమర్శించడం అంటే.. సిగ్గే నాకు సిగ్గైతాందని సిగ్గుపడ్డట్టు ఉంటది. మహేశ్వర్ రెడ్డి అంటడు.. తలుపులు మూసీ తెలంగాణను ఏర్పాటు చేయాల్సిన అసరం ఏమొచ్చింది అంటడు..? ఇంకా సిగ్గులేకుండా.. అప్పుడు, ఇప్పుడు ఇదే చెప్తున్నం..తలుపులు మూసీ తెలంగాణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని.. నేనడుగుతున్నా బీజేపీ నాయకులను.. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇదే స్టాండ్ మీద నిలబడి తెలంగాణల ఓట్లడగాలే.. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని తీర్మాణం చేసి.. తప్పించుకున్న జూటా పార్టీ బీజేపీ.. తెలంగాణ ఏర్పడ్డనాడు రాజకీయ పరిస్థితులు ఎంత గంభీరంగ ఉన్నయో రాష్ట్రమంతా తెలుసు.
అయినా.. పార్టీ ఓడిపోతుందని తెలిసి కూడా.. ఆంధ్రా నాయకుల నుంచి భయంకరమైన అడ్డగింత ఉన్నప్పటికి.. ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా అమరుల ఆకాంక్షలు నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ. బీజేపీకి తెలంగాణ ఏర్పడటం ఎప్పుడూ ఇష్టం లేదు. ఒక్కసారి కాదు ఇప్పటికి పదిసార్లు ప్రధానమంత్రి, హోం మంత్రి పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిండని కామంట్లు చేసిండ్రు. మహేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో ఒక జోకర్.. ఆయనే అసెంబ్లీలో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందమంటే.. మా బీజేపోల్లు ఓ రామమందిరం పట్టుకున్నరు.. తెలంగాణల రామమందిరం పేరు చెప్తే ఓట్లు పడతయా అన్నా అని నాతో చెప్పి బాధపడ్డడు.. నేనేదో నా సొంత ఇమేజ్ తో గెలిచిన.. బీజేపీ నుంచి నాకొచ్చిన ఫయిదా ఏంలేదని చెప్పిండు. మా దగ్గర మండలాధ్యక్షున్ని ఎన్నుకోవాలన్నా ఢిల్లీదాక పోవాలే అన్నా.. ఇది పార్టీ కాదు.. అంబానీ, అదానీ కార్పోరేట్ బ్రాంచ్ అని నాతో చెప్పి బాధపడ్డడు. అప్పుడే కాంగ్రెస్ లో ఉంటే ఇయ్యాల మంత్రిని అయ్యేవాన్నని దిగులుపడ్డడు.. అట్లాంటి వ్యక్తి నన్ను షిండే అన్నడంటే నాకే విచిత్రం అయితాంది. నేను షిండేను అవునో కాదు భగవంతునికి ఎరుకగని.. ఆయన మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్ కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనర్ధన్ రెడ్డి. అవకాశం ఇస్తే.. రాత్రికి రాత్రే పార్టీ మారుతనని బతిమాలినోడు.. కాంగ్రెస్ లో ఎవ్వరు సప్పుడు చెయ్యకపోయేసరికి నాపై కామెంట్లు చేస్తున్నడు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యాల వెనక పెద్ద కుట్ర ఉంది. కాంగ్రెస్ లో పుట్టిన.. కాంగ్రెస్ జెండాతోనే పోతా.. కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.