Congress MLA Komatireddy Rajgopal Reddy Made Comments on CM KCR.
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైపోయింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని, త్వరలో తేదీని ప్రకటిస్తామన్నారు. ఈ విధంగానే రాజగోపాల్ రెడ్డి సైతం తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎదురునిలువగల దమ్ము, ధైర్యం బీజేపీకే ఉందన్నారు. ఈ క్రమంలోనే తాజాగా చౌటుప్పల్‌లో నిర్లక్ష్యానికి గురైన రోడ్లను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ… వందలసార్లు అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించానని, ఒక్క సమస్య కూడా ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. వివక్ష పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఎందుకు ఈ వివక్ష అని ఆయన మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట నిధులు ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి సిరిసిల్లకు గజ్వేల్ కు పరిమితం అయితే మునుగోడు తెలంగాణలో లేదా.. మునుగోడు ప్రజలు ఉద్యమం చేయలేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటే ఉప ఎన్నికలు వస్తాయని, ఉప ఎన్నికలు వస్తే ఆ తీర్పు కేసీఆర్ పతనానికి నాంది అవుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, కుటుంబ పాలనను అంతమొందిచడమే నా లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.