మునుగోడులో రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం చుట్టూ చూస్తోంది. రాష్ట్ర ప్రజలు మునుగోడు రాజకీయ వాతావరణంపై ఆసక్తిగా చూస్తున్నారు. అయితే.. తాజాగా మునుగోడు లో బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి సభ విజయవంతం చేసినందుకు మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో కానీవీనీ ఎరుగని రీతిలో మునుగోడులో నిన్నటి సభ జరిగిందని, ప్రాణం పోయినా నేను తప్పు చేయనన్నారు. మునుగోడు ప్రజలు, ఓటర్లు ప్రజాస్వామ్యంను కాపాడుతారన్న నమ్మకం మాకు ఉందని, నిన్నటి సభకు ప్రజలు రాకుండా 8 కిలోమీటర్లు దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారన్నారు.
పోలీసుల తీరు వల్ల చాలా మంది ప్రజలు సభకు రాలేకపోయారని, సభకు వచ్చే మంచినీటి ట్యాంక్ లను పోలీసులు రానివ్వలేదన్నారు. ఆదివారం ఐనా సభకు జనం రాకుండా అధికారులు పెన్షన్ ఐడి కార్డులు ఇచ్చారని, హెలికాప్టర్ లో ప్రజలను చూసి అమిత్ షా ఆశ్చర్యపోయారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు మునుగోడు వేదికగా అమిత్ షా సరైన కౌంటర్ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమిత్ షా ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డురంగా ఉన్నాయని, మునుగోడు సభకు వచ్చిన సీఎం ఎం మాట్లాడినారో మంత్రి జగదీష్ రెడ్డి చెప్పాలన్నారు. రాజ్యాంగం ఎమ్మెల్యేకు ఇచ్చిన హక్కును ప్రభుత్వం, మంత్రి జగదీశ్ రెడ్డి కాలరాశారన్నారు.