NTV Telugu Site icon

World Cup 2023: బీసీసీఐకి మరో తలనొప్పి.. ఈడెన్‌ గార్డెన్‌లో కూలిన గోడ

Eden Garden

Eden Garden

World Cup 2023: ఓ వైపు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతుండగా.. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో అశుభం చోటుచేసుకుంది. గురువారం నాడు ఈడెన్ గార్డెన్ స్టేడియం బయటి గోడలో కొంత భాగం కూలిపోయింది. వీటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో హుటాహుటిన బీసీసీఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ వైరల్‌ వీడియోను చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. బీసీసీఐ వ్యవస్థపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్‌ చేస్తున్నారు. ప్రపంచకప్‌ను ఘనంగా నిర్వహిస్తున్న బీసీసీఐకి స్థానికంగా ఉన్న సమస్యలు కొత్త తలనొప్పిని తీసుకొస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కొద్దిసేపు విద్యుత్ అంతరాయంతో డీఆర్‌ఎస్‌ పని చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్‌ స్టేడియంలో గోడ కూలింది.

Also Read: IND vs ENG: 1975-2019 వరల్డ్‌ కప్‌.. ఇండియా-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ వివరాలు ఇవే!

ఐసీసీ వరల్డ్‌ కప్‌ ప్రారంభమై సగం టోర్నీ ముగిసినా ఇప్పటిదాకా ఈడెన్‌ గార్డెన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా జరగకపోవడం గమనార్హం. అక్టోబర్‌ 28న నెదర్లాండ్స్‌.. బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉంది. మ్యాచ్‌కు 24 గంటల ముందు గోడ కూలింది. మట్టి తవ్వే యంత్రం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేడియానికి ఆనుకుని ఉన్న 3, 4వ గేటుకు మధ్యలో ఉన్న గోడకు బుల్డోజర్‌ తాకడంతో అది కూలిపోయింది. ఈ గోడకు ఆనుకుని ఫ్లడ్‌లైట్‌ స్టాండ్‌ కూడా ఉండటం గమనార్హం. వరల్డ్‌ కప్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్‌లో బంగ్లాదేశ్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో పాటు నవంబర్‌ 5న భారత జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ ఆడనుంది. నవంబర్‌ 11న ఇంగ్లాండ్‌.. పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది. అంతేగాక నవంబర్‌ 16న సెమీస్‌ మ్యాచ్‌ జరగనుంది. వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేయడానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, బీసీసీఐ అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు.

ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు ఇవే..
అక్టోబర్ 28: నెదర్లాండ్స్ vs బంగ్లాదేశ్
అక్టోబర్ 31: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్
నవంబర్ 5: ఇండియా vs దక్షిణాఫ్రికా
నవంబర్ 11: ఇంగ్లండ్ vs పాకిస్థాన్‌
నవంబర్ 16: సెమీ-ఫైనల్ మ్యాచ్