Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా పలు కీలక అంశాలపై స్పందించారు. తనను జాతీయ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ.. ఇప్పటి వరకు దక్షిణాదిలో కేవలం రెండు రాష్ట్రాలకే అధ్యక్షుల నియామకం జరిగిందని, నన్ను జాతీయ అధ్యక్షుడిగా చేయాలన్న ప్రతిపాదన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం పార్టీలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ చర్చలో లేదని తెలిపారు. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను అనుసరించి భవిష్యత్తులో బీజేపీ తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకం ద్వారా ప్రభుత్వాన్ని నడపాలనే కాన్సెప్ట్‌కి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. భూములు అమ్మడం, అప్పులు చేయడం, మద్యం అమ్మకాలు… ఇవే ఆదాయం సమకూర్చే మార్గాలుగా ఈ ప్రభుత్వం భావిస్తోంది అంటూ ఆరోపించారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పని చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్ అదే మార్గాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిధిలోని చెట్ల కొట్టడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క చెట్టును కొట్టాలన్నా అనుమతి అవసరం. కానీ, ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తూ హెచ్‌సీయు భూముల్లో చెట్లను కూల్చుతోందని విమర్శించారు. అటవీ ప్రాంతంలో జంతువులు ఉన్నాయని, తాను ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అక్కడ జంతువులు ఉంది అవాస్తవమా అంటూ ప్రశ్నించారు.
అలాగే, ఈ భూముల వెనుక మా ఎంపీ ఉంటే ఆ పేరును బయటపెట్టండని, ఎవరు అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ అధికారులు కూడా ఈ భూములు హెచ్‌సీయువే అని స్పష్టంగా చెబుతున్నారని గుర్తు చేశారు. అలాగే హైదారాబాద్ లో ఉన్న పలు బిల్డింగ్ ల్లో ప్లాట్ లు ఖాళీగా ఉన్నాయి.. వాటిని కొనేందుకు ఎవరు రావడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడడం లేదు.. అక్కడ గ్రీనరీ అలానే ఉండాలని మా పోరాటమని అన్నారు. HCU లో జంతువులు ఉన్న మాట వాస్తవం.. నా మీద కేసు పెట్టిన ఎదుర్కోవడానికి నేను సిద్దం, ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు. వేరే రాష్ట్రం వ్యాపారస్తులు ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చుతారు వారికేమి పని.. వక్ఫ్ చట్టం పై ఆందోళన చేయడం అంటే భూ బకాసురులకు వత్తాసు పలికినట్టే అని వ్యాఖ్యానించారు.
ఎంఐఎం కబ్జా దారులను పోగేసి ఆందోళన చేస్తుందని, కాకపోతే పేద ముస్లిములకు మాత్రమే ఆందోళన చేసే హక్కు వాళ్లకు ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం వల్ల ఏమీ నష్టమో చెప్పాలని.. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగదని, వక్ఫ్ చట్టం పైన మేము మా మేనిఫెస్టోలో పెట్టే చేశామని తెలిపారు. ఇక్కడ కూడా మైనారిటీ వర్గాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఈ నెల 17న సన్నాహక సమావేశం ఉందని తెలిపారు. ముస్లిం ప్రార్థన మందిరాలకు వక్ఫ్ బోర్డు కు సంబంధం లేదని, మజీదుల ద్వారా వచ్చే ఆదాయంతో వక్ఫ్ బోర్డు నడవదన్నారు. ఎన్నికలన్నప్పుడు ఓటర్లందరిను కలుస్తాం.. బిఆర్ఎస్, కాంగ్రెస్, ఈ పార్టీ.. ఆ పార్టీ.. అని కాకుండా అందరినీ ఓట్లు అడుగుతామని అన్నారు. ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన ఆ పార్టీ పక్కన చేరి ఎంఐఎం ప్రాభల్యం పెంచుకుంటుందని అన్నారు. ఎంఐఎం చిన్నగా న్యూ సిటీ లోకి వచ్చిందని.. ఎర్రగడ్డ, బొరబండ లాంటి చోట్ల ఆ పార్టీ కార్పొరేటర్ లు గెలిచారని అన్నారు. భవిష్యత్ లో హైదారాబాద్ ను కబ్జా చేసే ప్రయత్నం ఆ పార్టీ చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ లకి బిగ్ బాస్ అసదుద్దీన్ ఒవైసీ అని కామెంట్ చేసారు.