Kishan Reddy sensational comments on Congress alliance with AIMIM: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లు బీసీల మెడలు కోసి మజ్లిస్ చేతిలో పెడుతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నడుస్తారని, పరిపాలన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు.. ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయం చెయ్యడంలో కాంగ్రెస్ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పోరుబాట ధర్నా నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘రిజర్వేషన్లతో ఎవరిని మోసం చెయ్యాలని అనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాలి. ఇది దేశానికి ఆదర్శమా?, తెలంగాణ దేంట్లో దేశానికి మోడల్. బీసీల మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ ఆహా. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 50 సీట్లు రిజర్వ్ చేస్తే .. 31 మంది నాన్ బీసీలు గెలిచారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లు సమాధానం చెప్పాలి. బీసీల మెడలు కోసి మజ్లిస్ చేతిలో పెడుతున్నారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నడుస్తారు.. పరిపాలన చేస్తారు. బీజేపీని అడ్డుకునేందుకు.. ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. తూతూ మంత్రంగా నిర్వహించిన సర్వే.. మోడల్ కాదు. సర్వే సమయంలో 25 శాతం ఇళ్లలోకి కూడా పోలేదు. బిల్ ఆమోదించాక రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం లేదు. ఢిల్లీకి ఎందుకు పంపారు. బీసీలను మోసం చేయడంలో, అవినీతి చేయడంలో మేం నిరక్షరాస్యులం. ఓట్ల కోసం, అవినీతి కోసమో పార్టీలు మారము’ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Also Read: Kishan Reddy vs Rahul Gandhi: నేను దేనికైనా సిద్ధం.. రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి ఛాలెంజ్!
‘సోనియా గాంధీని నేను ప్రశ్నిస్తున్నా. ఉన్నత స్థానంలో ఉన్న ద్రౌపది ముర్ము ను తెలంగాణ మంత్రి చేసిన మాటలు ఖండిస్తున్నా. రాష్ట్రపతిపై తెలంగాణ మంత్రి చేసిన మాటలకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి. భారత జాతికి సమాధానం చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఇది మహిళలను అవమానించడం. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయం చెయ్యడంలో కాంగ్రెస్ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే కమిషన్‌ను కాంగ్రెస్ తొక్కి పెట్టింది. బీసీ కమిషన్‌కు రాజ్యంగా హోదా ఇచ్చింది బీజేపీ. కేంద్రమంత్రి వర్గంలో 27 శాతం బీసీలకు ప్రాతినిధ్యం ఉంది. ప్రధానిని కన్వర్టెడ్ బీసీ అంటారు. రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ ముఖ్యమంత్రి. రాహుల్ రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని ఏళ్లు అయ్యిందో, కాంగ్రెస్ కుంచించుకు పోతుంది. ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ కు దిక్కు లేదు. రాహుల్ ప్రధాని అవుతాడో కాదో కానీ.. రేవంత్ మాత్రం ఘోరంగా ఓడిపోతాడు. రేవంత్ స్థాయికి మించి మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం. అసదుద్దీన్, అజహరుద్దీన్ బీసీలు అవుతారా. 10 శాతం ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తే.. బీసీ రిజర్వేషన్ల కోసం బాధ్యత తీసుకుంటా. రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో మాట్లాడతా’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.