Kim Jong Un’s Bulletproof Train: ఆయనో కదిలే అణుబాంబు. అమెరికాను అణుబూచి చూపెట్టి భయపెట్టే దేశాధినేత. ఇంతకీ ఆయన ఎవరని ఆలోచిస్తున్నారా? ఇంకెవరో కాదు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్. ఆయన తన దేశం విడిచి బయటికి ప్రయాణించాలి అంటే కేవలం ఓ ట్రైన్‌లో పోతాడు. ఏదేశాధినేత అయినా సరే ఎక్కడికైనా వెళ్లాలంటే ఏ విమానం లేదా హెలీకాప్టర్ వంటివి ఉపయోగిస్తారు. ఈయన చాలా ప్రత్యేకం. అందుకే స్పెషల్ ట్రైన్ వేసుకొని వేరే కంట్రీ విజిట్‌కి వెళ్తాడు. ఆయన అంత నమ్మకంగా ట్రైన్‌లో వెళ్లడానికి కారణాలు ఏంటీ?, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Wedding Tradition: ఇదేమి ఆచారామయ్య బాబు.. పెళ్లి చేసుకుంటే కొరడా దెబ్బలు?
ఏ క్షిపణులు ప్రభావం చూపవు..
ఈ ప్రత్యేక సాయుధ రైలుపై బాంబులు, క్షిపణులు ఎటువంటి ప్రభావం చూపవు. ఇది కేవలం రైలు మాత్రమే కాదు, కదిలే కమాండ్ సెంటర్. దీనిని ఆ దేశంలో ముద్దుగా ‘టేయాంగో’ (సూర్యుడు) అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన, సురక్షితమైన రైళ్లలో ఒకటి. ఈ రైలును 20కి పైగా సాయుధ కోచ్‌లతో తయారు చేశారు. ఇది ప్రత్యేకంగా కిమ్ భద్రత, సౌకర్యం, జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ రైలులో 20-25 కోచ్‌లు ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కటి సాధారణ కోచ్‌ల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఎందుకంటే అవన్నీ బుల్లెట్ ప్రూఫ్, బాంబు ప్రూఫ్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఆర్మర్డ్ కోచ్‌లు, అదనపు భద్రతా పరికరాల కారణంగా ఇది చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి రైలు వేగం గంటకు 50-60 కి.మీ వరకు ఉంటుంది. ఇటీవల కిమ్ ఈ రైలులో రష్యాలోని వ్లాడివోస్టాక్ సమీపంలోని ఆర్టియోమ్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. నాటి నుంచి ఈ ప్రత్యేక రైలు మళ్లీ వార్తల్లో నిలిచింది.
తాత, తండ్రి కూడా..
కిమ్ జోంగ్ ఉన్ తాత కిమ్ ఇల్-సంగ్, ఆయన తండ్రి కిమ్ జోంగ్-ఇల్ కూడా విమాన ప్రయాణానికి భయపడి ఇలాంటి సాయుధ రైళ్లను ఉపయోగించారు. కిమ్ జోంగ్-ఇల్ వద్ద ఇలాంటి 6 రైళ్లు ఉన్నాయి. వాటిలో ఒకటి కిమ్ జోంగ్ ఉన్‌కు వారసత్వంగా వచ్చింది. కిమ్ రైలు దాని ప్రత్యేకమైన డిజైన్, భద్రత కారణంగా భిన్నంగా ఉంటుంది. ఈ రైలు కిమ్ ప్రయాణాన్ని సురక్షితంగా చేయడమే కాకుండా, ఉత్తర కొరియా శక్తిని ప్రపంచానికి చాటిచెప్తుంది.
680 కి.మీ దూరానికి దాదాపు 24 గంటలు
ఈ రైలు ప్యోంగ్యాంగ్ నుంచి వ్లాడివోస్టాక్ (680 కి.మీ) వరకు ప్రయాణించడానికి దాదాపు 20-24 గంటలు పడుతుంది. ఈ రైలులో విలాసవంతమైన బెడ్‌రూమ్‌లు, బాత్రూమ్‌లు, కాన్ఫరెన్స్ గదులు, కిమ్ కోసం ఒక ప్రైవేట్ కార్యాలయం ఉన్నాయి. ఒక ప్రత్యేక కోచ్‌లో తాజా లాబ్‌స్టర్, ఫ్రెంచ్ వైన్, రష్యన్, చైనీస్, కొరియన్, జపనీస్ వంటకాలను అందించే రెస్టారెంట్ ఉంది. శాటిలైట్ ఫోన్‌లు, ఇంటర్నెట్, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అందుకే దీనిని కదిలే కమాండ్ సెంటర్ అని పిలుస్తారు. ఈ రైలు భద్రతా వ్యవస్థ అభేద్యమైనది. దీని కోచ్‌లు వైమానిక దాడుల నుంచి రక్షణ పొందడానికి క్షిపణి రక్షణ వ్యవస్థ, చిన్న ఆయుధాలతో అమర్చి ఉంటాయి. ప్రయాణానికి ముందు 100 మందికి పైగా భద్రతా సిబ్బంది రైల్వే మార్గం, స్టేషన్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. రష్యా – ఉత్తర కొరియా మధ్య రైలు పట్టాల వెడల్పులో వ్యత్యాసం కారణంగా, సరిహద్దు వద్ద రైలు చక్రాలను మార్చడానికి చాలా గంటలు పడుతుంది. ఈ సమయంలో భద్రత మరింత కఠినతరం చేస్తారు.
READ ALSO: ATOR N1200 Amphibious Vehicles: ఇండియన్ ఆర్మీ సూపర్ వెహికిల్స్.. వరదల్లోనూ రయ్ రయ్..