Bhupalpally: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం హత్యకు గురైన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ప్రాథమిక దర్యాప్తులో భూవివాదమే హత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ కేసులో రేణికుంట్ల కొంరయ్య, రేణికుంట్ల సంజీవ్ లతో రాజలింగమూర్తికి భూ వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో భాగంగా పోలీసులు రేణికుంట్ల సంజీవ్, అతని బావమరిది శీమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు మోరె కుమార్, కొత్తూరి కుమార్ పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రాజలింగమూర్తి గతంలో తహసిల్దార్ చక్రధర్, రేంజ్ ఆఫీసర్, ఒక విఆర్ఓను ఏసీబీకి పట్టించడంతో అతనిపై కక్ష పెంచుకున్నవారు ఉన్నారు. 171 సర్వే నెంబర్‌లోని అటవీ శాఖ భూమిలో రాజలింగమూర్తి జోక్యం చేసుకోవడం వివాదాస్పదమైంది. ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఉన్న భూమి విషయంలో రేణిగుంట కుటుంబంతో రాజలింగమూర్తికి తగాదాలు జరిగాయి. గత 15 రోజులుగా భూమి వివాదంపై గొడవలు జరుగుతుండగా, రేణిగుంట కుటుంబ సభ్యులు డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రాజలింగమూర్తి హత్య కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణను వేగవంతం చేసింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
Read Also: Hyderabad Doctor: సరదాగా ఈత కోసం నదిలోకి దూకిన లేడి డాక్టర్.. చివరకు?
ఇది ఇలా ఉండగా.. భూపాలపల్లిలో జరిగిన లింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సిఐడి విచారణకు ఆదేశించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మధ్యాహ్నం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టులో అక్రమాలపై గతంలో లింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంలో కోర్టు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు అప్పట్లో నోటీసులు జారీ చేసింది. ఈ హత్య కేసు వెనుక మరిన్ని రాజకీయ, భూవివాదాల కోణాలు ఉన్నాయా? మరెవరెవరు దీనిలో ప్రమేయం ఉన్నారు? అనేది దర్యాప్తులో తేలనుంది.