రాష్ట్రంలో ఏ చెట్టును అడిగినా.. పుట్టను అడిగినా సైకిల్ మాటే వినపడుతోందని.. కూటమి గెలుపు మాటే వినపడుతోందని చంద్రబాబు చెప్పుకుచ్చారు. కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పేదల భూముల రికార్డులు మాయం చేసి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. విశాఖలో ఎన్నారై భూమిని లాక్కోవడానికి తుపాకీ గురి పెట్టి బెదిరించారని ఆరోపించారు. అలాగే తిరుపతిలో ఓ డాక్టర్ భూమిని కూడా ఆక్రమించుకుని రికార్డులు మాయం చేశారని చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు కొట్టడం మగతనం కాదని వ్యాఖ్యానించారు. వైసీపీ వల్ల ఎవరూ లబ్ధిపొందలేదని పేర్కొన్నారు. చంద్రగిరి అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మహిళలతో కూడా చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. ఆర్థిక స్వాతంత్రాన్ని మహిళలకు కల్పించిన పార్టీ టీడీపీ అని తెలిపారు. డ్వాక్రా సంఘాలు పెట్టిందే తెలుగు దేశమని చెప్పుకొచ్చారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద.. నెలకు 1500 వందల రూపాయలు అకౌంట్‌లో వేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఈ నెల 27 తేదీ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపోందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు వరుస పర్యటనలు చేయనున్నారు.
దేశ వ్యా్ప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభం కానుంది. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.