Kerala CM Meets PM: ప్రధాని నరేంద్ర మోదీని కేరళ ముఖ్యమంత్రి పినరయి ఇవాళ ఢిల్లీలో కలిశారు. ప్రధాని కార్యాలయంలో కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొవిడ్ సంసిద్ధత, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల ఆమోదం గురించి చర్చించారు. మరో కోవిడ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, దానిని ఎదుర్కోవడానికి కేరళ సంసిద్ధతపై సమావేశంలో చర్చించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అంతే కాకుండా కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడం, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మాట్లాడారని తెలిసింది.
ప్రధాని మోదీ, కేరళ సీఎం పినరయి విజయన్ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి ప్రధాని మోదీకి కథాకళి శిల్పాన్ని బహుమతిగా ఇచ్చారు. మొదట, రాష్ట్ర ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ ఈ సమావేశం ప్రధాని మోడీ అధికారిక నివాసంలో జరిగిందని తెలిపింది. అయితే తరువాత ఇద్దరు నేతలు న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో కలుసుకున్నారని స్పష్టం చేసింది.
Terror Attack Averted: తప్పిన భారీ ఉగ్రదాడి.. 15 కిలోల పేలుడు పదార్థాలు నిర్వీర్యం
బఫర్ జోన్, సిల్వర్‌లైన్ ప్రాజెక్ట్, మహమ్మారి నుండి కేరళ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన సమస్యలు కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భేటీకి ముందు తెలిపాయి. అయితే, సమావేశంలో చర్చించిన ఈ అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి, కేంద్రం అనుసరిస్తున్న వక్రీకరణ విధానాలు, పెద్దగా ఆలోచించకుండా జీఎస్టీని అమలు చేయడం, జీఎస్టీ పరిహారం పంపిణీలో జాప్యం, రాష్ట్ర రుణ పరిమితిలో కేంద్ర ప్రభుత్వం కోత విధించడం వంటి కారణాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది.