Site icon NTV Telugu

BRS Protests: కేసీఆర్ సిట్ విచారణ వేళ బీఆర్ఎస్ భారీ స్కెచ్‌!

Kcr, Sit, Brs

Kcr, Sit, Brs

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో ఆ పార్టీ భారీ స్థాయిలో కార్యాచరణకు సిద్ధమైంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం పిలుపునిచ్చింది. గ్రామ, మండల, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్కో చోట ఒక్కో కార్యక్రమం ఉండేలా ప్లాన్ రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

అధినేత కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరే ప్రతి మార్గాన్ని జనాలతో నింపాలనే వ్యూహాన్ని బీఆర్ఎస్ సిద్ధం చేసింది. కేసీఆర్ ప్రయాణించే మార్గాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పాములపర్తి రాజీవ్ రహదారి టర్నింగ్, గౌరవరం, ములుగు, ఒంటిమామిడి, షామీర్పేట ప్రాంతాల్లో భారీ జన సమీకరణకు పార్టీ నేతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: KCR-SIT: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్!

ఇదిలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఉదయం 8 గంటలకే తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. విచారణ జరుగుతున్న సమయంలో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్‌లోనే ఉండి పరిణామాలను పర్యవేక్షించనున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే హౌస్ అరెస్టులకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కినట్లు కనిపిస్తోంది.

Exit mobile version