NTV Telugu Site icon

MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ కాదంట..!

Kavitha

Kavitha

MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (AI) ప్రమాదకరమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఆమె దానిపై కౌంటర్ ఇచ్చారు. “AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు… అనుముల ఇంటెలిజెన్స్!” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కవిత, ఈ ‘అనుముల ఇంటెలిజెన్స్’ వల్లే రాష్ట్రానికి ముప్పు ఏర్పడిందని తీవ్ర విమర్శలు చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ రాజ్యంలో విధ్వంసాన్ని సృష్టిస్తోందని, అది పక్కకు జరగకుండా రాష్ట్రానికి మంచి జరగదని తేల్చేశారు.

ఆమె బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతూ, అనుముల ఇంటెలిజెన్స్‌ను వాడి కులగణనను తప్పుదారి పట్టించారంటూ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టిందని గుర్తుచేస్తూ, అదే ధైర్యం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, 2011లో యూపీఏ ప్రభుత్వం కులగణన చేసినప్పటికీ ఇప్పటికీ వివరాలు బయటకు రాలేదని, బీజేపీ అయితే బీసీ కులగణన చేయబోమని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధిక దీక్షకైనా సిద్ధమన్నారు.

ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని హైప్ క్రియేట్ చేసినా చివరికి ఆయన రాలేదని ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా తెలుగులోనే మాట్లాడారని విమర్శిస్తూ, ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తీసుకురావాలంటే వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలన్నా సూచించారు. అంతేకాకుండా, ఏప్రిల్ 11లోగా మహాత్మా పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో స్పష్టత ఇవ్వాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

Amazon Mega Electronics Days: 75% వరకు భారీ డిస్కౌంట్.. మొదలైన అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్