వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు.
READ MORE: Adilabad Airport : ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు మరో ముందడుగు
భారతదేశంలోని కోట్లది మంది ప్రజలకు సంబంధించిన అంశంలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలోనే వీళ్లకు మైనారిటీలు గుర్తొస్తారా? అని నిలదీశారు. దేశంలోని మైనారిటీలను కాపాడుతామని ప్రగల్బాలు పలికే రాహుల్ గాంధీ వక్ఫ్ బిల్లుపై చర్చలో ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ, మైనారిటీల హక్కులను కాలరాసే వాక్ఫ్ చట్ట సవరణ బిల్లు పై ఎందుకు మాట్లాడలేదని అడిగారు.
READ MORE: MLC Nagababu: పిఠాపురంలో హై టెన్షన్.. నాగబాబు పర్యటనలో జై వర్మ నినాదాలు
కాగా.. మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదించాయి. లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు వేశారు. అంతకుముందు మంగళవారం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా వాడీవేడీగా చర్చ కొనసాగింది. ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీయడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ సమావేశాలకు సోనియా గాంధీ దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరైనప్పటికీ ఈ బిల్లుపై ఏం మాట్లాడలేదు. ఈ అంశాన్ని తాజాగా ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు.