రాజకీయాల్లో పరిస్థితులు ఒకేలా ఉండవు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఒకవైపు మంత్రి కాకాణి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇటు ఎమ్మెల్యే ఆనం, నేదురుమల్లి మధ్య మాటల యుద్ధం, ప్రచ్చన్నయుద్దం ముదురుతోంది. తాజాగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు వైసీపీలో కాకరేపుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ పనితీరుపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కావలి నియోజక వర్గంలో భారీగా గ్రావెల్ కుంభకోణం జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంలో చిన్నచిన్న అవకతవకలు జరుగుతున్నాయన్నారు. తమ అవసరాల కోసం కొందరు అనధికారకంగా గ్రావెల్ ను తవ్వుకుంటున్నారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికే టిడిపి నేతలు రాద్ధాంతం చేస్తున్నారని.. వారి హయాంలో జరిగిన అవినీతి గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు.
తామేమీ సత్యవంతులం కాదని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. కావలి నియోజకవర్గంలో షాడో ఎం.ఎల్.ఏ.గా వ్యవహరిస్తున్న ఒక నేత భారీగా తవ్వకాలు చేసినట్టు ఆ పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఇలా వ్యాఖ్యానించడంపై విపక్ష నేతలు నోరెళ్లబెడుతున్నారు. మేం చేసిన ఆరోపణలు ఎంత వాస్తవమో దీనిని బట్టి అర్థం చేసుకోవాలంటున్నారు. స్వంత పార్టీ, ప్రభుత్వంపై గతంలోనూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా కావలి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలని క్యాడర్ వాపాతోంది.
Read Also: Water Contamination : హిమాచల్ ప్రదేశ్లో కలుషిత నీరు తాగి 535మందికి అస్వస్థత