Siddeshwar Swami Passes Away: పాండిత్య ప్రసంగాలు, శక్తివంతమైన వక్తృత్వానికి పేరుగాంచిన కర్ణాటకలోని జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి సోమవారం కన్నుమూశారు. 81 ఏళ్ల పీఠాధిపతి గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం ఆశ్రమంలో తుది శ్వాస విడిచారని విజయపుర డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేష్ ప్రకటించారు. జ్ఞానయోగాశ్రమ ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు తరలివచ్చి నివాళులర్పించారు. స్వామికి కర్నాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలలో కూడా భక్తులు, అనుచరులు ఉన్నారు.
కర్నాటక ప్రభుత్వం సిద్దేశ్వర స్వామికి ప్రభుత్వ లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. సిద్దేశ్వర స్వామికి నివాళులు అర్పించేందుకు విజయపుర జిల్లా యంత్రాంగం మంగళవారం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ముఖ్యనేతలు సిద్దేశ్వర స్వామి మృతిపట్ల సంతాపం తెలిపారు. సిద్దేశ్వర స్వామి సమాజానికి చేసిన విశిష్ట సేవలు గుర్తుండిపోతాయని.. ఇతరుల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పని చేశారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశ్రమానికి వచ్చినప్పుడు ప్రధాని మోడీ ఫోన్‌లో స్వామి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
విజయపురలోని జ్ఞానయోగాశ్రమానికి చెందిన సిద్దేశ్వర స్వామి శివైక్యం చెందారనే వార్త విని చాలా బాధపడ్డానని, తన ఉపన్యాసాల ద్వారా మానవాళి మోక్షానికి కృషి చేసిన పీఠాధిపతి సేవలు అద్భుతమని, అద్వితీయమని బొమ్మై ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన నిష్క్రమణ రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొంటూ.. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు.
Delhi: యువతిని ఢీకొట్టి 12 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. ఈ ఘటనపై ఆప్, ఎల్జీ మధ్య మాటల యుద్ధం
జ్ఞానయోగాశ్రమం ప్రకారం.. 14 సంవత్సరాల వయస్సులో స్వామీజీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టారు. మల్లికార్జున స్వామీజీ శిష్యరికంలోకి వచ్చారు. గురువు వద్ద ఉంటూనే విద్యాభ్యాసమంతా పూర్తి చేశాడు. మృదుస్వభావి, సరళమైన రూపాన్ని కలిగి ఉన్న స్వామీజీ చాలా నిరాడంబరంగా ఉండేవారు. స్వామీజీ ఉపనిషత్తులు, గీత, శరణా తత్వశాస్త్రం, సాధారణ ఆధ్యాత్మికతపై అనేక పుస్తకాలు రాశారు. అతని ప్రధాన రచనలలో కొన్ని సిద్ధాంత శిఖామణి, అల్లమప్రభు వచన నిర్వచన, భగవద్ చింతన (దైవ ప్రతిబింబాలు). ఇంగ్లీషులో కూడా పుస్తకాలు రాశారు.
మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, జేడీ(ఎస్) నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి, బొమ్మై మంత్రివర్గంలోని పలువురు సహచరులు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.