Karnataka Assembly Election: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధమైంది. 34 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్ లెక్కింపు ఉదయం 8గంటలకు మొదలవుతోంది. తొలి రౌండ్ 9 గంటలకు పూర్తవుతుంది. బెంగళూరు సిటీలో 4 కేంద్రాలు, మిగతా జిల్లాల్లో 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మొత్తం 73.19 శాతం పోలింగ్ రికార్డైంది. అత్యధికంగా చికబల్లాపురా నియోజకవర్గ లో 85.56శాతం నమోదయింది. రాష్ట్రంలో 58వేల 545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఎక్కడ రిపోలింగ్ జరగలేదు.
మరోవైపు కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ తో గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్.. బెంగళూరుకు రమ్మంటూ అభ్యర్థులకు పిలుపునిచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకూ క్యాంపులోనే ఉండాలని సూచించింది. ఆపరేషన్ లోటస్ భయంతో కాంగ్రెస్ హైకమాండ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. మెజారిటీకి కాస్త అటూఇటూగా ఫలితాలు వెలువడితే ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందని అధిష్ఠానం భావిస్తోంది. ఆపరేషన్ లోటస్ భయంతో, తమ కేండిడేట్లు చేజారిపోకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అటు పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలను వెలువరించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేశాయి.,ఒకవేళ హంగ్ వస్తే… జేడీఎస్ మద్దతు ఇచ్చే పార్టీనే అధికారపీఠాన్ని కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీ లు తమతో సంప్రదింపులు జరిపాయని జేడీఎస్ నేతలు అంటున్నారు. . ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో తాము ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నామని… సరైన సమయంలో ప్రజలకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని స్పష్టం చేశారు. జేడీఎస్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. జేడీఎస్ ను బీజేపీ సంప్రదించలేదని చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా కర్ణాటక ఫలితాల్ని పలువురు భావిస్తున్నారు. దీంతో కర్ణాటక కౌంటింగ్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.