Karimnagar Woman Kills Husband After Watching YouTube Videos: ఇటీవలి కాలంలో భర్తల పాలిట భార్యలు మృత్యువుగా మారారు. ఇష్టంలేని పెళ్లి, వివాహేతర సంబంధం లాంటి పలు కారణాలతో తాళి కట్టిన భర్తలను భార్యలు పక్కాగా స్కేచ్ వేసి హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలో భార్యలు జైలు పాలవుతున్నారు. అయినా కూడా భర్తల హత్యలు ఆగడం లేదు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటుచేసుకుంది. భర్త పెట్టే ఇబ్బందులను తట్టుకోలేని ఓ భార్య.. యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ప్రియుడితో దారుణంగా హత్య చేయించింది. ఏమీ తెలియనట్లు నాటకమాడి.. చివరకు పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన కరీంనగర్ సుభాష్ నగర్‌లో చోటుచేసుకుంది.
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపిన ప్రకారం… సుభాష్ నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్ (45) జిల్లా లైబ్రరీలో స్వీపర్‌గా పని చేసేవారు. అతనికి భార్య రమాదేవి, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య రమాదేవి సర్వపిండి వ్యాపారం చేసేది. సంపత్ రోజూ మద్యం తాగి భార్యను కొట్టేవాడు. సంపత్‌కు స్నేహితుడైన కర్రె రాజయ్యతో రమాదేవికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని రమాదేవి నిర్ణయించుకుంది. యూట్యూబ్‌లో వీడియోస్ చూసి పథకం వేసింది. తాను యూట్యూబ్‌లో ఓ వీడియో చూశానని, ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని, అదే పద్ధతిలో భర్తను హత్య చేయాలని ప్రియుడు రాజయ్యకు రమాదేవి చెప్పింది.
జులై 29న భార్య రమాదేవితో గొడవపడిన సంపత్.. ఇంటి నుంచి వెళ్లిపోయారు. అదేరోజు సంపత్‌ను రాజయ్య మద్యం తాగేందుకు పిలిచాడు. బొమ్మకల్ రైల్వే ట్రాక్ వద్ద రాజయ్య స్నేహితుడు కీసరి శ్రీనివాస్ కూడా వారితో ఉన్నాడు. సంపత్ మద్యం బాగా తాగి మత్తులోకి జారుకున్నాడు. ఆ సమయంలో రాజయ్యకు రమాదేవికి ఫోన్ చేసి ప్లాన్ ప్రకారం తన భర్తను చంపాలని చెప్పింది. రాజయ్య తన వెంట తెచ్చుకున్న గడ్డిమందును సంపత్ చెవిలో పోశాడు. కాసేపటికే గడ్డిమందు మెదడుకు చేరి అతడు చనిపోయాడు. ఏమీ తెలియనట్లు భర్త ఇంటికి రాలేదని కుమారుడుతో కలిసి రమాదేవి వెతికింది. మరుసటి రోజు భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 1న సంపత్ మృతదేహందొరికిందని రమాదేవి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
Also Read: Raj Gopal Reddy: సీఎం రేవంత్‌పై మరోసారి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్!
భర్త మృతికి కారణాలు తెలుసుకోకుండా, మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని రమాదేవి పోలీసులను కోరింది. దాంతో రమాదేవిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి మృతిపై అనుమానం ఉందని కొడుకు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రమాదేవి ఫోన్‌ను పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారించగా.. తామే హత్య చేసినట్టు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ అంగీకరించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
