Site icon NTV Telugu

Karimnagar: కరీంనగర్ లో 20 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

Nomination123

Nomination123

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తైంది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా పర్యవేక్షించారు. పార్లమెంటు స్థానానికి మొత్తం 53 మంది అభ్యర్థులు 94 నామినేషన్లు దాఖలు చేశారు. క్రమ పద్ధతిలో వాటిని పరిశీలించి వివరాలు, పత్రాలు సక్రమంగా ఉన్న నామినేషన్లను అధికారులు ఆమోదించారు. లోపాలున్నా, సరిగా వివరాలు సమర్పించని 20 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఒక్కొక్క నామినేషన్ పత్రానికి సంబంధించి వివరాలు.. పత్రాలు సక్రమంగా ఉన్నాయా.. లేదా అని జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు మాత్రం తిరస్కరణకు గురికాలేదు. 53 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వివరాలు సరిగా లేని 20 మంది నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 33 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్లు పేర్కొన్నారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ను తిరిగి చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

READ MORE: Jasprit Bumrah: ఏంటి బుమ్రా ఆ ప్రాక్టీస్.. ఓపెనర్‌గా రాబోతున్నావా ఏంటి..? వీడియో వైరల్..

ఎందుకు నామినేషన్ తిరస్కరణకు గురైందో అందుకు సంబంధించిన వివరాలను కూడా అభ్యర్థులకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఎవరైనా అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసిన తర్వాత మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం శనివారం, ఆదివారం సెలవు ఉంటుందని తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల్లోగా నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకోవచ్చని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో ఉపసంహరణకు చాన్స్ ఉండదని అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరి పాటించాలని పేర్కొన్నారు.

Exit mobile version