విశాఖ సాగరతీరం ఇవాళ కాపునాడు బహిరంగ సభతో వేడెక్కనుంది. రాధా-రంగా రీ యూనియన్ ఛలో వైజాగ్ కు పిలుపు నిచ్చింది. వంగవీటి మోహన్ రంగా జయంతిని పురస్కరించుకుని వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 34ఏళ్ళ తర్వాత మరోసారి కాపునాడు జరగనుంది. కాపుల ఐక్యత ప్రధానంగా తలపెట్టిన ఈ సభలో ఎటువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎంవీపీ కాలనీలోని ఏ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో భారీ డయాస్ ఏర్పాటు చేశారు. 2500మంది సీటింగ్ కోసం కుర్చీలు వేశారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నాయకత్వం అంతా ఈ సభకు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
Read Also: Gudivada Tension: గుడివాడలో టెన్షన్.. టెన్షన్
మరోవైపు., పోస్టర్ రిలీజ్ లో పాల్గొన్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సభకు వస్తారా….?.రారా…!!? అనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 26న భారీ ఎత్తున కాపులతో సభను నిర్వహిస్తుండడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ సభకు ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాపు సోదరులు తరలిరానున్నారు. కాపునాడు మహాసభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటున్నారు. ఈ సభ ద్వారా ఏపీలో కాపులకు ఉన్న ప్రాధాన్యతను రాజకీయపార్టీలకు తెలియచేస్తామంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుందన్నారు.
రాబోయే రోజుల్లో కాపుల పాత్ర ఏపీ రాజకీయాల్లో ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? అనే విషయాలు చర్చించకుండా సభ సాగదు అని అంటున్నారు.ఈ సభకు సంబంధించి వైసీపీ మంత్రులను ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. అంతే కాదు వారి ఫోటోలను కూడా ఆహ్వాన పత్రాలలో ముద్రించడం విశేషం. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమరనాథ్, విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖఅనకాపల్లి వైసీపీ జిల్లాల ప్రెసిడెంట్లు అయిన పంచకర్ల రమేష్ బాబు కరణం ధర్మశ్రీలతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సహా వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు అందాయి. మరీ వీరంతా వస్తారా? వస్తే వారేం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది.
ఈ సభలో తెలుగుదేశం జనసేన నేతలు కూడా వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. కాపునాడులో కాపులకు సంబంధించిన రిజర్వేషన్ల డిమాండ్ మళ్లీ చర్చకు వస్తుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు ముఖ్యమంత్రి అన్న ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం నుంచి కిమిడి కళా వెంకటరావుతో పాటు పలువురు సీనియర్ నేతలను పిలిచారు. జనసేన నుంచి కూడా పలువురు నాయకులు హాజరవుతున్నారు. ఈ సభకు ఎవరెవరు వస్తారు? ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
Read Also:BIG Breaking: విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ బీభత్సం.. కార్లు, బైక్‌లపై దూసుకెళ్లడంతో..