Kapil Dev: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..

  • సంజు శాంసన్‌ స్ఫూర్తితో అభిషేక్‌ పుంజుకొంటాడు: కపిల్ దేవ్..
  • ఆదివారం ఫైనల్‌కు రెడీ అవుతున్న టీమిండియా..
  • శాంసన్, బుమ్రా ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన కపిల్ దేవ్
Sanju

Sanju

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు జోరు చూస్తుంటే అందరూ సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు విజయాలను అందించారు. వెస్టిండీస్‌తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో శాంసన్ 97 పరుగులు, బుమ్రా 2 వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక సెమీఫైనల్‌లో కూడా శాంసన్ 89 పరుగులతో రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చారు.

ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌పై అందరి కళ్లూ ఉన్నాయి. అయితే.. జట్టులో నిలకడగా రాణిస్తున్న బుమ్రా, శాంసన్‌ల గురించి.. అలాగే సరిగ్గా ఆడలేక ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ గురించి భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

‘‘జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్. ఒత్తిడిలో కూడా అతను ఎలా బౌలింగ్ చేస్తాడో మనందరికీ తెలిసిందే. అతనికి ఎంతటి గౌరవమైనా దక్కుతుంది. ఇక సంజూ శాంసన్ అద్భుతమైన క్రికెటర్. గత రెండు మ్యాచ్‌ల్లో అతను ఆడిన తీరు అమోఘం’ అని కపిల్ ప్రశంసించారు.

Also Read:IND vs NZ Final: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే!

అయితే ఫామ్ లేమితో సతమతమవుతున్న యువ బ్యాటర్ అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతూ.. “పెద్ద ఆటగాళ్లు కూడా కొన్నిసార్లు ఫామ్ కోల్పోవడం సహజం. అభిషేక్ శర్మ పరిస్థితి కూడా అంతే. త్వరలోనే సంజూ శాంసన్ స్పూర్తితో కచ్చితంగా అభిషేక్ పుంజుకుంటాడు. తనపై తనకి నమ్మకం ఉండాలి. ఫైనల్ మ్యాచ్ ఇంకా మిగిలే ఉంది, అందులో తను సత్తా చాటుతాడు” అని కపిల్ ధీమా వ్యక్తం చేశారు.

“వ్యక్తిగత ప్రదర్శనలు ముఖ్యమే.. కానీ అంతిమంగా జట్టు గెలవడమే ముఖ్యం” అని కపిల్ అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగే ఫైనల్‌లో భారత్ గెలిస్తే.. సూర్యకుమార్ యాదవ్ కూడా వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ల జాబితాలో (కపిల్, ధోనీ, రోహిత్ సరసన) చేరుతారని ఆయన గుర్తు చేశారు. 1983లో తాను వరల్డ్ కప్ గెలిచినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కపిల్, ఏ పని మొదలుపెట్టినా దాన్ని విజయవంతంగా ముగించడం ముఖ్యమని పేర్కొన్నారు.