సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవాల వేళ పెను విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. అందులో కొందరి పరిస్థితి విషంగా ఉంది. ఈ ఘటనపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు.
‘బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన దుర్ఘటన మాటలకందని విషాదం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఈ విచార సమయంలో భగవంతుడు వారికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ‘బెంగళూరులో చోటుచేసుకున్న ఘటన హృదయ విదారకం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ లోకనాయకుడు కమల్ హాసన్ పేర్కొన్నారు.
Also Read: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు కారణాలు ఇవే!
కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమాకు మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థగ్ లైఫ్ థియేటర్లలో విడుదలైంది. అయితే కర్ణాటకలో మాత్రం ఈ చిత్రం రిలీజ్ కాలేదు. థగ్ లైఫ్ సినిమా ఈవెంట్‌లో కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే.