NTV Telugu Site icon

Medigadda Barrage : కేసీఆర్‌, హరీష్‌ రావుల పిటిషన్లపై విచారణ వాయిదా

High Court

High Court

Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్, హరీష్ రావులు, ఇతరుల అవినీతే కారణమని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టులో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా కోర్టు, కేసీఆర్, హరీష్ రావులను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

 Sambhaji Maharaj: శంభాజీ మహారాజ్‌పై వివాదాస్పద కంటెంట్.. వికీపీడియా ఎడిటర్లపై కేసు..

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ, భూపాలపల్లి కోర్టు విచారణార్హత లేకున్నా ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ, కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. విచారణ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాదులు, భూపాలపల్లి కోర్టులో ఫిర్యాదు చేసిన నాగవెల్లి రాజలింగమూర్తి ఇటీవల మృతి చెందినట్టు హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన వ్యక్తిగత హాజరు ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.

మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్, హరీష్ రావులపై భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన రాజలింగమూర్తి ఇటీవల హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసి రాజలింగమూర్తిని హత్య చేశారు. ఈ హత్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Rekha Gupta: ఒక్కరోజు కూడా కాలేదు.. అప్పుడే అతిషి విమర్శలా?