హనుమకొండ జిల్లా హరితహోటల్ లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియ శ్రీహరి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాసయిందని, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేయబోతోందన్నారు కడియం శ్రీహరి. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు లో అఫిడవిట్ ఫైల్ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పాలించాలి..ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. దళితబంధు లబ్ధిదారుల నిధుల ఫ్రీజ్ ను ఎత్తివే యాలని ఆయన డిమాండ్ చేశారు. దళితబంధును కొనసాగించాల్సిందే… పేరు మార్చి అంబేద్కర్ అభయ హస్తం గా మార్చిన మాకు ఇబ్బంది లేదన్నారు కడియం శ్రీహరి. దళితబంధు అక్రమాలపై విచారణ జరిపితే మాకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేస్తుందని మాకు నమ్మకం లేదని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఏడాది వరకు ఓపిక పట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. జనగామ మండలం యశ్వంతపూర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఉన్నాయని, మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి 7సీట్లు ఉన్నాయని, బిజెపికి ఎనిమిది సీట్లు ఉన్నాయని అప్పుడు ఆయన గుర్తు చేశారు. మొత్తంగా 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్న ఆయన సంవత్సరంలోపు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇక ఇప్పుడు యూ టర్న్ తీసుకున్న కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని వ్యాఖ్యానించిన ఆయన ఇప్పుడు ఐదేళ్లు కొనసాగాలని ఆకాంక్షించడం ఆసక్తిగా మారింది.