K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..

K Annamalai

K Annamalai

K Annamalai: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా దూకుడుగా వ్యవహరించిన కే. అన్నామలై ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, రాబోయే రోజుల్లో ఒక సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మార్పు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసేలా కనిపిస్తోంది. తమిళనాడుకు సంబంధించి పార్టీ కేంద్ర నాయకత్వంతో ఉన్న రాజకీయ వ్యూహాత్మక విభేదాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నామలై వివరించారు. రాష్ట్రంలో పార్టీ వెళ్లాల్సిన దిశపై తనకున్న ఆలోచనలు, హైకమాండ్ ఆలోచనలతో ఏకీభవించలేదని పేర్కొన్నారు. ఈ విషయమై గత 18 నెలలుగా పార్టీ అగ్రనాయకత్వంతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ, ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతోనే తాను పక్కకు తప్పుకున్నానని తెలిపారు. వాస్తవానికి తాను పార్టీ వీడాలనే నిర్ణయాన్ని 2025 డిసెంబర్ 4వ తేదీనే నాయకత్వానికి తెలియజేశానని, అయితే అప్పట్లో కొన్ని ఎన్నికల బాధ్యతలను పూర్తి చేయాలని కోరడంతోనే ఇంతకాలం కొనసాగానని, ఆ బాధ్యతలు ముగియడంతోనే ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చానని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు సైతం అన్నామలై తెరదించారు. సీనియర్ నేత బీఎల్ సంతోష్ తనకు ఇచ్చిన హామీ, నిబద్ధత చూసే తాను గతంలో బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. పార్టీని వీడినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీపై తనకు ఎప్పటికీ అత్యున్నత గౌరవం ఉంటుందని, తన రాజకీయ ప్రయాణంలో తనకు లభించిన అవకాశాలకు, నాయకత్వం చూపిన నమ్మకానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని చెప్పారు. అయితే, తమిళనాడులో పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై విభేదాలు ఉన్న తరుణంలో తాను పార్టీకి ఎలాంటి ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతోనే గౌరవప్రదంగా తప్పుకున్నట్లు వివరించారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన వెంటనే అన్నామలై తన తదుపరి కార్యాచరణను ప్రకటించారు. తమిళనాడులో ఒక సరికొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి, స్వతంత్రంగా ప్రజా క్షేత్రంలో పోరాడతానని తన మద్దతుదారుల సమక్షంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన విషయాన్ని సైతం ఆయన పంచుకున్నారు. తాను రాజీనామా చేసిన వెంటనే లెజెండరీ నటుడు రజనీకాంత్ తనను కలిసి పనిచేయాల్సిందిగా కోరారని, కానీ తాను మాత్రం సొంతంగా ఒక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు హింట్ ఇచ్చారు.

×
×
Ad

అన్నామలై స్థాపించబోయే ఈ నూతన రాజకీయ ఉద్యమం పూర్తిగా ‘సామాన్యుడి రాజకీయం’ (Common-man politics) చుట్టూనే తిరగనుంది. తమిళనాడులో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యక్తుల ఆరాధన, “కల్ట్ పాలిటిక్స్” (వ్యక్తిగత పూజ) సంస్కృతికి స్వస్తి పలికి, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించడమే తన లక్ష్యమని అన్నామలై ఉద్ఘాటించారు. ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ తిరిగే రాజకీయాల నుంచి రాష్ట్రం వెలుపలికి రావాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తూ, తమిళనాడు రాజకీయాల్లో కొత్త పంథాను సృష్టిస్తానని, అందులో భాగంగానే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను స్వతంత్రంగా బరిలోకి దిగుతానని మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై స్పష్టమైన ప్రకటన చేశారు.