నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో బుద్ధవనంను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున సాగర్ లోని బుద్ధవనంను సందర్శించానని, బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని ఆయన తెలిపారు. ఆచార్య నాగార్జునుడు తిరిగిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనం ను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి. బౌద్ధ టూరిజం సర్క్యూట్ లో తెలంగాణలోని బుద్ధవనంను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని, యువత్ ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన ప్రాంతం బుద్ధవనం అని ఆయన వ్యాఖ్యానించారు.