Jubilee Hills by-Election: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిజిస్టర్ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తుల కేటాయించారు. అంబేద్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి చేపూరి రాజుకి రోడ్ రోలర్, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీకి చెందిన అంబోజు బుద్దయ్యకి చపాతీ రోలర్ గుర్తును కేటాయించారు. గతంలో ఈ సింబల్స్ తొలగించాలని ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. కారు గుర్తుకు దగ్గరగా ఉన్న గుర్తుల కారణంగా ఓటర్లు సింబల్స్ గుర్తింపులో కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటోలు ప్రింట్ చేయనుంది ఈసీ.. ఇది బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
READ MORE: Pakistan Debt Crisis: పేదరికంలో నయా రికార్డు..! పాకిస్థాన్‌ను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న షాబాజ్..
కాగా.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో ఇవాళ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో వెల్లడించారు. ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది పోటీపడగా.. 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు.