JD Lakshmi Narayana: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమంగా మారాలి అంటూ పిలుపునిచ్చారు సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అనే ప్రచారం చేస్తున్నారు.. నమ్మకం పెట్టుకున్న మూడు పార్టీలు మోసం చేశాయి. ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమంగా మారాలి అని ఆకాక్షించారు. ఇక, 14వ ఆర్థిక సంఘం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వద్దని చెప్పలేదని గుర్తుచేశారు.. కానీ, అసమర్థతను వేరేవాళ్లపై నెట్టేసే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతోందన్నారు. నాలుగు సార్లు అద్భుతమైన అవకాశం వచ్చినా పార్టీలు పట్టించుకోలేదని.. కేంద్రం చెప్పిన చిలక పలుకులనే మన పాలకులు ఇక్కడ చెబుతున్నారు అంటూ దుయ్యబట్టారు వీవీ లక్ష్మీనారాయణ.
Read Also: Sharad Pawar: నా పార్టీని అన్యాయంగా లాగేసుకున్నారు.. ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు శరద్ పవార్..
ఇక, ఒకరేమో ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నారు.. మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. ఇంకొకరు తలలు తెగిపడినా ఫర్వాలేదు.. కానీ, మేం పోరాడతాం అని అన్నారు.. కానీ, ప్రత్యేకహోదా రాలేదు, ప్యాకేజీ అందలేదు, మెడలు వంగలేదు, తలలు తెగిపడిందీ లేదు అంటూ గతంలో పాలక, ప్రతిపక్షాలపై లక్ష్మీనారాయణ ఫైర్ అయిన విషయం విదితమే.. నిరుద్యోగం పెరిగిపోయింది, చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ప్రత్యేక హోదా అడగడానికి మూడు సార్లు అద్భుతమైన అవకాశం వచ్చినా.. కానీ అడిగే ధైర్యం చేయలేదని.. రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రత్యేక హోదా అడగడానికి అవకాశం ఇచ్చింది. కానీ, ప్రత్యేక హోదాపై అడిగే ధైర్యం ఎవరికీ లేకపోయిందని ఆయన ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే.