JC Prabhakar Reddy Emotional: యువగళం పేరుతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 70 రోజులకు చేరుకున్న విషయం విదితమే.. అయితే, లోకేష్ పాదయాత్రపై భావోద్వేగానికి గురయ్యారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టుకున్నారు.. కార్యకర్తలు లేకపోతే నేను లేనన్న ఆయన. చంద్రబాబు చేసిన మంచి పనులతో ప్రజల మనిషి అయ్యారని పేర్కొన్నారు.. ఇక, లోకేష్ జనం కోసం పాదయాత్ర చేస్తున్నాడు.. అసలు లోకేష్ కు ఏం తక్కువ..? ఎంతో విలాసవంతమైన జీవితం వదిలేసి.. ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నాడు.. లోకేష్ కాళ్లకు బొబ్బలు వచ్చాయి.. ఆ బొబ్బలను చూస్తే బాదేసిందన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..
కాగా, రెండు రోజుల క్రితమే నారా లోకేష్ పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన విషయం విదితమే.. లోకేష్ బస చేసిన ప్రాంతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కాళ్లకు ఉన్న బొబ్బలను చూసి కంటతడిపెట్టుకున్నారు. ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మరోవైపు.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.. తాడిపత్రిలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.. టపాసులు కూడా కాల్చారు.. ఇక, ఆ టపాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమావేశం దగ్గర పడడంతో.. వారు ఫిర్యాదు చేయడం.. జేసీ అనురులపై కేసులు పెట్టడం అన్నీ జరిగిపోయాయి.
మరోవైపు, తాడిపత్రి నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా లోకేష్ కు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికిన విషయం విదితమే.. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు లోకేష్ తో ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణుల్లో మరింత జోష్ పెంచారు. డప్పు చప్పుళ్లకు స్టెప్పులు వేస్తూ ఆయన సందడి చేశారు. తనతో పాటు పక్క వాళ్లతో కూడా స్టెప్పులు వేయిస్తూ హుషారును పెంచిన విషయం విదితమే.