BCCI Plans to release advertisement for Team India New Coach: టీమిండియా కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా స్వయంగా వెల్లడించారు. ఇష్టం ఉంటే ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. టీ20 ప్రపంచకప్ 2024తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవి కాలం ముగియనుంది. వాస్తవానికి వన్డే ప్రపంచకప్ 2023తోనే ది వాల్ కాంట్రాక్ట్ ముగిసింది. అయితే భారత జట్టు ఆసియా కప్ గెలవడం, ప్రపంచకప్ ఫైనల్ వెళ్లడంతో ద్రవిడ్ బృందంపై బీసీసీఐ నమ్మకముంచి.. కాంట్రాక్ట్‌ను పొడిగించింది.
‘భారత జట్టు కొత్త కోచ్ కోసం బీసీసీఐ త్వరలో ప్రకటన విడుదల చేస్తుంది. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ వరకు మాత్రమే ఉంది. ఇష్టం ఉంటే అతను కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కోచ్‌తో సంప్రదించిన తర్వాతే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మరియు ఇతర కోచింగ్ సిబ్బందిపై నిర్ణయం తీసుకుంటాం. కొత్త కోచ్ భారతీయుడా లేదా విదేశీయుడా అనేది మేము నిర్ణయించలేము. ఇది సీఏసీకి సంబంధించిన విషయం. మూడు ఫార్మాట్లలో వేర్వేరు కోచ్‌లను తీసుకునే నిర్ణయం కూడా సీఏసీదే. భారతదేశంలో ఆ సంస్కృతి పూర్వం లేదు’ అని బీసీసీఐ కార్యదర్శి జే షా అన్నారు.
కొత్త కోచ్‌ను దీర్ఘకాలికంగా నియమించే అవకాశం ఉందని జే షా చెప్పారు. కనీసం మూడేళ్ల పదవీ కాలం ఉంటుందని షా ధృవీకరించారు. ఇప్పటివరకు రెండేళ్ల పదవి కాలం ఉందన్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని కొనసాగించడంపై కెప్టెన్లు మరియు కోచ్‌లతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జే షా పేర్కొన్నారు.