ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. లార్డ్స్‌లో ఫైవ్ వికెట్ హాల్ (5/74) ప్రదర్శన చేశాడు. హ్యారీ బ్రూక్ (11), బెన్ స్టోక్స్ (44), జో రూట్ (104), క్రిస్ వోక్స్ (0), జోఫ్రా ఆర్చర్ (4)లను బుమ్రా అవుట్ చేశాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మొదటిసారి ఫైవ్ వికెట్ హాల్ తీసినా.. పెద్దగా సంబరాలు చేసుకోలేదు. లార్డ్స్ మైదానంలో అరుదైన ఘటన నెలకొల్పినా.. సెలెబ్రేషన్స్ ఎందుకు చేసుకోలేదని క్రికెట్ అభిమానుల్లో ప్రశ్నలు తలెత్తాయి. ఇందుకు గల కారణాన్ని బుమ్రా వెల్లడించాడు. తానేమీ కుర్రాడిని కాదని, అప్పటికే బాగా అలసిపోయా అని బదులిచ్చాడు.
రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ‘నేను బాగా అలసిపోయాను. అందుకే పెద్దగా సంబరాలు చేసుకోలేదు. మైదానంలో చాలా ఓవర్లు బౌలింగ్ చేశా. శారీరకంగా అలసిపోయా. అయినా ఎగిరి గంతులు వేయడానికి ఇప్పుడు నేనేమీ కుర్రాడిని కాదు. మామూలుగానే సంబరాలు చేసుకోవడానికి ఇష్టపడను. అందులోనూ ఈరోజు బాగా అలసిపోయాను. నా ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉన్నా. ఐదో వికెట్ పడ్డాక బౌలింగ్‌ను కొనసాగించడానికి వెళ్లిపోయా’ అని బుమ్రా తెలిపాడు.
Also Read: Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం!
జస్ప్రీత్ బుమ్రా లార్డ్స్ టెస్టులో తొలిరోజు 18 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. రెండోరోజు 9 ఓవర్లు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 15వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. లార్డ్స్‌లో మొదటిసారి ఫైవ్ వికెట్ హాల్ ప్రదర్శన చేశాడు. మొత్తంగా విదేశాల్లో 12వ సారి. దీంతో విదేశాల్లో అత్యధిక ఫైఫర్‌లు నమోదు చేసిన టీమిండియా బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. పనిభారంతో భాగంగా బుమ్రా రెండో టెస్ట్ ఆడని విషయం తెలిసిందే. మిగిలిన రెండు టెస్టులో ఒకటి మాత్రమే ఆడనున్నాడు.