Japan: జపాన్ ప్రధాన మంత్రి పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేశారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)లో విభజన జరగకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ చర్య తీసుకున్నారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో జపాన్ పాలక సంకీర్ణ ప్రభుత్వం ఎగువ సభలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. పార్టీలో నాయకత్వ మార్పు కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎగువ సభ ఎన్నికల ఫలితాలు ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా అధికారంపై పట్టును మరింత బలహీనపరిచాయి. అయినప్పటికీ ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటించారు. తాజాగా షిగేరు రాజీనామా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
READ MORE: Luckiest Zodiac Signs: ఈ ఐదు రాశుల వాళ్లకు తిరుగు లేదు.. అదృష్టం అంటే వీళ్లదే..
వాస్తవానికి.. జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంటు ఎగువసభలో మెజారిటీ కోల్పోయింది. సభలో 248 స్థానాలుండగా, వాటిలో సగం సీట్లకు జులైలో ఎన్నికలు జరిగాయి. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) సభలో మెజారిటీ సాధించాలంటే 50 స్థానాలు దక్కించుకోవాలి. కానీ 47 స్థానాలకే పరిమితమైంది. గత అక్టోబరులో జరిగిన దిగువసభ ఎన్నికల్లోనూ ఈ కూటమి ఓటమి పాలైంది. 1955లో స్థాపించిన ఎల్‌డీపీ రెండు సభల్లో మెజారిటీని కోల్పోవడం ఇదే తొలిసారి. ప్రతికూలంగా ఫలితాలొచ్చినా తాను పదవిలో కొనసాగుతానని ఇంతకు ముందు ఇషిబా తెలిపారు. కానీ ఈ ఓటమితో రాజీనామా చేయాలని లేదా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధికార కూటమిలోని ఇతర రాజకీయ పార్టీల నుంచి ఇషిబాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కాగా.. గతేడాది సెప్టెంబర్లో జపాన్ మాజీ ప్రధానమంత్రి ఫుమియో కిషిద వారసుడిగా షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు.