అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. ఈ అంశంపై మొదటిసారిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడం దేశాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమ వలసదారులుగా ప్రకటించిన 104 మంది భారతీయులు బుధవారం పంజాబ్‌లోని అమృత్సర్‌కు తిరిగి వచ్చారు. ఆ విమానం బుధవారం శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపుతున్న తీరుపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రయాణం అంతా చేతులకు, కాళ్లకు బేడీలు వేశారని, అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగిన తర్వాతే తీసినట్లు బహిష్కరణకు గురైన వారు తెలిపారని రాజ్యసభలో ప్రస్తావించారు.
READ MORE: CRDA Letter to Election Commission: రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్..! ఈసీకి సీఆర్డీఏ లేఖ
ఈ అంశంపై రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. “తమ పౌరులు విదేశాలలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు తేలితే.. వారిని తిరిగి తీసుకోవడం మన బాధ్యత. ఇది అన్ని దేశాలకూ వర్తిస్తుంది. బహిష్కరణ ప్రక్రియ కొత్తదేం కాదు. అమెరికాలో అక్రమ వలసదారులను అరికట్టేందుకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) పనిచేస్తోంది. 2009 నుంచి బహిష్కరణలు కొనసాగుతున్నాయి. మన దేశం నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్తున్న వాళ్లను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భారత్‌కు తిరిగి వస్తున్న అక్రమ వలసదారులపై ఎలాంటి దురాక్రమణ చర్యలు జరగకుండా చూసుకోవడానికి అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం” అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. బుధవారం (నిన్న) 104 మంది భారతదేశానికి తిరిగి వచ్చారన్నారు. ఇదేం కొత్త అంశం కాదని.. 2009 నుంచి 2025 వరకు చాలా మంది మన దేశం నుంచి వెళ్లిన అక్రమ వలస దారులను అమెరికా పంపిందని పేర్కొన్నారు. 2009లో 734 మంది, 2010- 799, 2011- 597, 2012- 530, 2013-550 , 2014- 591, 2015- 708, 2016- 1303 , 2017-1024, 2018-1180, 2019- 2042 , 2020- 1889, 2021- 805, 2022- 862, 2023- 670, 2024-1368, 2025లో 104 మంది భారతీయులను అమెరికా బహిష్కరించినట్లు ఆయన తెలియజేశారు.