సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పంజాబ్‌లో ఖలిస్థానీ టెర్రరిస్టు అమృతపాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయన న్యాయవాది రాజ్‌దేవ్ సింగ్ ఖల్సా తెలిపారు. ప్రస్తుతం అమృతపాల్ సింగ్ అస్సాం జైల్లో ఉన్నారు. ఆయన పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. జైల్లో అమృతపాల్ సింగ్‌ను కలిసినట్లు ఆయన న్యాయవాది తెలిపారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అమృతపాల్ సింగ్ తనకు తెలియజేశాడని న్యాయవాది రాజ్‌దేవ్ సింగ్ ఖల్సా పేర్కొన్నారు.
జాతీయ భద్రతా చట్టం కింద వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృతపాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. 2023, ఏప్రిల్‌లో 29 ఏళ్ల అమృతపాల్ సింగ్ అరెస్ట్ చేసి… కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం అసోంలోని దిబ్రూఘర్ జైలులో ఉన్నారు. అమృతపాల్ సింగ్‌ను తన న్యాయవాది కలిశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయడంపై తదుపరి చర్చలు జరిపేందుకు ఆయన కుటుంబసభ్యులు కూడా గురువారం జైలులో ఆయనను కలవనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో 7వ దశలో ఖాదూర్ సాహిబ్ స్థానానికి జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి లాల్‌జిత్ సింగ్ భుల్లార్‌ను బరిలోకి దించగా.. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) తరఫున హర్‌పాల్ సింగ్ బలేర్ బరిలో నిలిచారు.
ఇది కూడా చదవండి: Dulam Nageswara Rao: కైకలూరు వైసీపీ అభ్యర్థి సమక్షంలో వైసీపీలో చేరికలు..
పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఒకే దశలో పోలింగ్ జరగనుంది. చివరి విడతలో.. అనగా.. జూన్ 1న అన్ని స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో 43.95% ఓటింగ్‌తో కాంగ్రెస్ నుంచి జస్బీర్ సింగ్ గిల్ గెలిచారు. శిరోమణి అకాలీదళ్ నుంచి బీబీ జాగీర్ కౌర్ 30.51% ఓటింగ్‌తో రన్నరప్‌గా నిలిచారు. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ విడత శుక్రవారం జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: AP High Court: వాలంటీర్ల రాజీనామాతో సంబంధం లేదన్న ఈసీ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
అలాగే సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ కూడా బటిండా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సిన అవసరం ఉంది.