రాహుల్ గాంధీ ప్రజలను సంఘటితం చేసే పనిలో ఉన్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయమైన పాలన బీజేపీ చేయడం లేదు కాబట్టి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు హద్దు లేకుండా పోయింది మోడీ పాలనలో అని, అస్సాంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ఆయన మండిపడ్డారు. అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ.. ఒకప్పుడు కాంగ్రెస్ గూటి పక్షే అని ఆయన వ్యాఖ్యానించారు. మెప్పుకోసం రాహుల్ గాంధీని అడ్డుకుంటున్నారని, రాహుల్ గాంధీ గుడికి పోవద్దా అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గుడికి పోవాలి అంటే.. అస్సాం సీఎం అనుమతి అవసరమా అని ఆయన జగ్గారెడ్డి అన్నారు. మోడీ మెప్పు కోసం అస్సాం సీఎం ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వమే లా అండ్ ఆర్థర్ సమస్య సృష్టిస్తోందన్నారు జగ్గారెడ్డి.
అంతేకాకుండా.. ‘బీజేపీ నేతలు ఈ మధ్యనే కండ్లు తెరిచారు. దేశం కోసం ప్రాణం ఇచ్చినది గాంధీ కుటుంబం. అలాంటి రాహుల్ గాంధీని అడ్డుకునే కుట్ర చేస్తుంది బీజేపీ. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ని ఎందుకు కలిశారో తెలియదు. గతంలో సీఎంని ఎమ్మెల్యేలు కలవాలి అంటే కుదిరేదీ కాదు. 9 ఏండ్లలో దక్కని అవకాశం.. సీఎం రేవంత్ రెండు నెలలో నే కల్పించారు. రేవంత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్న. 9 ఏండ్లలో మీ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు. గతం గురించి కేటీఆర్ మాట్లాడితే.. మీ గతం గురించి మాట్లాడాల్సి వస్తోంది చూసుకో. కేటీఆర్..పద్దతి కాదు. కేటీఆర్.. తండ్రి.. కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు. మీ నాయనా ఎక్కడ పని చేయకుండా ఉంటే.. రేవంత్ గురించి మాట్లాడితే బాగుంటుంది. మీ నాయనా డైరెక్ట్ బీఆర్‌ఎస్‌తోనే రాజకీయాలు చేశాడా. రేవంత్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది. బీఆర్‌ఎస్ చంపిన ప్రజాస్వామ్యం ని….కాంగ్రెస్ బతికించింది. ప్రతిపక్ష సభ్యుల గొంతు brs నొక్కింది..కానీ మేము ప్రజాస్వామ్యం ఇస్తున్నాం. సీఎంని కలిసి తమ సమస్య చెప్పుకునే వెసులుబాటు ఇచ్చింది కాంగ్రెస్. శ్రీరాముడు దేవుడు.. వాళ్ళని మొక్కాలి అని బీజేపీ వాళ్ళు చెప్పాలా. దేవుడు పుట్టిన తర్వాత బీజేపీ పుట్టిందా.. బీజేపీ పుట్టిన తర్వాత దేవుడు పుట్టాడా. రాహుల్ గాంధీ ఇంట్లో దేవుణ్ణి మొక్కడా. మోడీ సీతారాముల కల్యాణం చేస్తాడో లేదో తెలియదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా చేస్తారో లేదో తెలియదు. కానీ ప్రతీ ఏడాది నేను చేస్తా. సీతారామ కల్యాణం మోడీ చేసినట్టు ఎప్పుడైనా చూశారా. బీజేపీ పుట్టి 40 ఏండ్లు.. శ్రీరాముడు..సీతమ్మ పుట్టి నాలుగు యుగాలు అయ్యింది. రాజకీయంగా బతకాలి అని రాముణ్ణి ఎత్తుకున్నది బీజేపీ. మొన్నటి వరకు ఇన్నాళ్లు బతుకమ్మ లేదు అని కవిత బతుకమ్మ పేరుతో సినిమా చూపించింది. ఇప్పుడు మోడీ..రామాలయం పేరుతో సినిమా చూపిస్తున్నాడు. ఇవన్నీ కొద్దీ రోజులే.. బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది అనుకోవడం భ్రమ.’ అని ఆయన వ్యాఖ్యానించారు.