కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని, మరలా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పాలనా పరంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏనాడూ సచివాలయానికి రాలేదని, కేవలం వారి ఇళ్ల నుంచే పరిపాలన కొనసాగించారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.
సదాశివ పేట పట్టణంలోని కందకం రోడ్డు పనులపై ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. ‘సదాశివ పేట పట్టణంలోని కందకం రోడ్డుకు నేను ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ మంత్రి మహీధర్ రెడ్డిల సహకారంతో 2014లో రూ.20 కోట్లు మంజూరు చేయించా. 2014లో నిధులు మంజురైతే 11 ఏళ్ల పాటు ఎందుకు పనులు పూర్తి చేయలేక పోయారు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ నేనే రివ్యూ చేయాల్సి వస్తుందంటే.. సదాశివ పేట ప్రజలు ఆలోచించాలి. ఉమ్మడి రాష్ట్రంలో 20 కోట్లు మంజూరైతే..11 సంవత్సరాలలో 15 కోట్లు ఖర్చు చేశారు. పనులు ఇప్పటికీ పూర్తి చేయలేక పోయారు. ఇంకా 5 కోట్లు పనులు మిగిలి ఉన్నాయి’ అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read: Gautam Gambhir: నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను!
‘నా రివ్యులకు వచ్చే అధికారులు భయపడాల్సిన అవసరం లేదు. మీపై ఆఫీసర్లు ఎవరైనా ఏమైనా అంటే నా పేరు చెప్పిండి. గెలుపు, ఓటమి నన్ను ప్రభావితం చేయలేవు. నా రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. రాత్రుళ్లు జెండాలు కట్టి.. పగటి పూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర నాది. నేను కులం పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు.. జనం మధ్య నుంచే వచ్చాను’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.