గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్య ఘటనపై సీఎం వైఎఎస్ జగన్ ఆరా తీసినట్టు చెబుతున్నారు. సీఎంఓ అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఈకేసులో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దిశ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తిచేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని సీఎం కోరారు. దోషిత్వాన్ని నిరూపించి కఠినశిక్ష పడేలా చూడాలన్న జగన్ అనూష కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబానికి భరోసానివ్వాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించినట్టు చెబుతున్నారు. ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడు గ్రామానికి చెందిన కోట అనూష అనే యువతి నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రి 2వ సంవత్సరం చదువుతుంది.
అదే కాలేజ్ లో తనతోటి విద్యార్ధి విష్ణువర్ధన్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ రోజు ఉదయం కాలేజీ కి వచ్చిన అనూషను విష్ణు వర్ధన్ రెడ్డి క్లాస్ నుండి బయటికి తీసుకు వెళ్ళాడని తోటి విద్యార్ధులు చెబుతున్నారు. అక్కడి నుండి అనూషను పాలపాడు రోడ్డులోని సాగర్ మేజర్ కాలువ వద్దకు తీసుకు వెళ్ళి ఆమెను హత్య చేసి విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ చేస్తున్నారు. అనూష హత్యకేసుకు సంబంధించి ఉద్రిక్తత కొనసాగుతోంది. నిందితుడిని అప్పగించాలంటూ పల్నాడు బస్టాండ్‌లో బంధువులు, సన్నిహితులు, గత ఆరుగంటలకు పైగా మృతురాలి శవంతో ఆందోళన చేస్తున్నారు.