Jacintha Kalyan Pitch Curator: క్రీడా చరిత్రలో భారతదేశ మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా జసింత కళ్యాణ్ తన పేరును లిఖించుకున్నారు. బెంగుళూరు వేదికగా జరుగుతోన్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో జసింత పిచ్ తయారీ బాధ్యతలను చేపట్టారు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డుల్లో నిలిచారు. ఒకప్పుడు రిసెప్షనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన జసింత.. ఇప్పుడు క్రికెట్ పిచ్ క్యూరేటర్‌గా అవతరిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేస్‌సీఏ)తో జసింత కళ్యాణ్ 30 సంవత్సరాలుగా అనుబంధం కలిగి ఉన్నారు. 19 ఏళ్ల వయసులో కేస్‌సీఏలో రిసెప్షనిస్ట్‌గా జసింత కెరీర్ ఆరంభించారు. ఆపై కేస్‌సీఏలో పనిచేయడం ప్రారంభించింది. చాలా కాలంగా పిచ్ క్యూరేటర్ల జట్టులో భాగంగా ఉన్నారు. ఇప్పుడు ఆమెకు చీఫ్ పిచ్ క్యూరేటర్‌గా అవకాశం వచ్చింది. డబ్ల్యూపీఎల్ కేవలం మహిళా క్రికెటర్లకు మాత్రమే కాకుండా.. ఒక మహిళా పిచ్ క్యూరేటర్‌కు కూడా అవకాశాన్ని కల్పించింది.
Also Read: Ranji Trophy 2024: 10, 11 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి.. సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు!
పిచ్ క్యూరేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన జసింత కళ్యాణ్‌ను బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రత్యేకంగా అభినందించారు. భారత క్రికెట్ చరిత్రాత్మక పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. ‘జసింత కళ్యాణ్ భారత దేశపు తొలి మహిళా క్రికెట్ పిచ్ క్యూరేటర్‌గా అవతరించారు. బెంగుళూరులో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంలో పిచ్ తయారీ బాధ్యతలు చేపట్టిన జసింత ఈ ఘనత సాధించడం ఆమె నిబద్ధత, ధైర్యానికి నిదర్శనం. జసింత పాత్ర ఆటకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. పిచ్ క్యూరేటర్ పాత్రలో ఆమె రావడం భారతదేశంలో క్రికెట్ అభివృద్ధి చెందుతున్న దృశ్యాన్ని ప్రతిబింబిస్తోంది. మైదానంలో అదరగొట్టే క్రీడాకారిణులను మాత్రమే కాకుండా.. ఆట కోసం తెరవెనుక అవిశ్రాంతమైన కృషి చేస్తున్న జసింత వంటి అసాధారణ వ్యక్తులను కూడా అభినందించడం అత్యవసరం’ అని జై షా పేర్కొన్నారు.