Jabalpur Baby: ఇది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ బిడ్డ సాధారణంగా నవజాత శిశువు బరువు కంటే ఎక్కువ బరువుతో భూమి మీదకు వచ్చి డాక్టర్లతో సహా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెలుగుచూసింది. జబల్పూర్‌లోని రాణి దుర్గావతి ఎల్గిన్ ఆసుపత్రిలో 34 ఏళ్ల ఆనంద్ చౌక్సే భార్య శుభంగి చౌక్సే ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఇక్కడి వరకు అంతా ఓకే కానీ.. జన్మించిన వాడు అందరిలాంటి వాడైతే ఈ స్టోరీలోకి ఎక్కేవాడు కాదు. మనోడు ఏకంగా 5.2 కిలోల బరువుతో పుట్టాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే సాధారణంగా నవజాత శిశువు బరువు 2.5 నుండి 3 కిలోల మధ్య ఉంటుంది. కానీ ఈ చిన్నారి వాళ్లందరినీ తన బరువుతో బీట్ చేసి ఆశ్చర్యపరిచాడు.
READ ALSO: Kadapa: జిల్లా కేంద్రాన్నే మార్చేసిన పెన్నానది..
తల్లీబిడ్డా క్షేమం..
ఆనంద్ చౌక్సే తన భార్య శుభంగి చౌక్సేను ప్రసవం కోసం రాణి దుర్గావతి ఎల్గిన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈసందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ భావన మిశ్రా మాట్లాడుతూ.. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా శుభంగి చౌక్సేకు డెలవరీ చేసినట్లు చెప్పారు. సాధారణంగా శిశువు 3 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నప్పుడు ప్రసవం సవాలుగా మారుతుందని అన్నారు. కానీ ఇక్కడ పిల్లోడు 5 కిలోల కంటే ఎక్కువ బరువుతో తల్లికడుపు నుంచి బయటికి వచ్చాడని చెప్పారు. ఇది చాలా అరుదైన సంఘటన అని అన్నారు. ఇది వేల ప్రసవాలలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే జారుతుందని, గర్భధారణ సమయంలో తల్లి మంచి ఆహారం, తగినంత పోషకాహారం తీసుకోవడం వల్ల బిడ్డ అధిక బరువుతో ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలు మధుమేహం లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల కూడా సంభవిస్తాయని అన్నారు. కానీ ఇక్కడ శుభంగి చౌక్సే రిపోర్టులు అన్నీ కూడా సాధారణంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
భారతదేశంలో ఆరోగ్యకరమైన నవజాత శిశువు సగటు బరువు 2.5 నుంచి 3.4 కిలోల మధ్య ఉంటుంది. అబ్బాయిల బరువు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలు సాధారణంగా 2.7, 3.2 కిలోల మధ్య బరువు ఉంటారు. అయితే 2.5 కిలోల కంటే తక్కువ బరువున్న పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. పుట్టినప్పుడు శిశువు బరువు తల్లి ఆరోగ్యం, గర్భధారణ వ్యవధి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
మనోడు.. మాక్రోసోమిక్ బేబీస్
డాక్టర్ భావన మిశ్రా మాట్లాడుతూ.. 4.5 కిలోల కంటే ఎక్కువ బరువున్న పిల్లలను మాక్రోసోమిక్ బేబీస్ అని అంటున్నారని చెప్పారు. అలాంటి పిల్లలు చాలా అరుదుగా పుడతారని పేర్కొన్నారు. అధిక బరువు కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రసవ సమయంలో అనేక రకాల సమస్యలు ఏర్పడుతాయి. కానీ తల్లీబిడ్డా ఇద్దరూ కూడా సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో గర్భిణీ స్త్రీలు ఎల్లప్పుడూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
READ ALSO: GST 2.0 Impact: GST 2.0 లో కొత్త కార్ల ధరలు ఎంత తగ్గాయో తెలుసా..