NTV Telugu Site icon

Chebrolu Kiran : ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ కి 14 రోజుల రిమాండ్

Chebrolu Kiran

Chebrolu Kiran

ఐటీడీపీ నేత చేబ్రోలు కిరణ్ కి మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిని దూషించిన కేసులో కిరణ్ కు రిమాండ్ విధించారు. కిరణ్ పై 111 సెక్షన్ పెట్టడంతో మంగళగిరి రూరల్ సీఐపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ ఇష్టానుసారంగా సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్ మోమో ఇవ్వాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు.

READ MORE: CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం.. ఫ్యూచర్‌ సిటీ వరకు మెట్రో

కాగా.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో వై.ఎస్‌.భారతిని ఉద్దేశించి అతను చేసిన అసభ్య వ్యాఖ్యలను టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కిరణ్‌కుమార్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ వెంటనే మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కిరణ్‌పై బెయిల్‌కు వీల్లేని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదైంది. రంగంలోకిదిగిన పోలీసులు సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్‌కుమార్‌ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

READ MORE: CSK vs KKR: చెన్నై తలరాతను ధోని మార్చగలడా? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్

అక్కడి నుంచి గుంటూరు తరలించారు. శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది. నిందితుడు కిరణ్‌కుమార్‌పై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం (బీఎన్‌ఎస్‌ 79), వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రేరేపించడం (బీఎన్‌ఎస్‌ 196(1)), అనుచిత వ్యాఖ్యలు (బీఎన్‌ఎస్‌ 353(1)), నేరపూరిత కుట్ర (బీఎన్‌ఎస్‌ 61 (2)), వ్యవస్థీకృత నేరం (బీఎన్‌ఎస్‌ 111(1)), ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67 (ఏ) వంటి బెయిల్‌కు వీల్లేని సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్టు చేసింది. అరెస్ట్‌కు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తంచేస్తూ కిరణ్‌కుమార్‌ ఒక వీడియో విడుదల చేశారు. ‘వైఎస్‌ భారతిగారు నన్ను క్షమించండి. మహిళలు అంటే నాకు గౌరవం ఉంది. నేను ఇంటర్వ్యూలో అసభ్యకరంగా మాట్లాడినందుకు మీ కాళ్లు పట్టుకుంటూ క్షమాపణలు కోరుతున్నా’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.