Minister Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొని, శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “పదిమందికి మేలు చేస్తే పది తరాలు గుర్తుంచుకోవాలి” అంటూ శ్రీపాదరావు సేవా స్ఫూర్తిని ప్రతిబింబించారు. శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన సేవలను ఆయన కొనియాడారు. నివాళులర్పించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రభుత్వ సామాజిక వైద్యశాలను సందర్శించారు. రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేయడంతో పాటు శానిటేషన్ సిబ్బందికి దుస్తులను అందజేశారు.
Read Also: Ganja Smuggling: రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. కానిస్టేబుల్‌ను ఢీ కొట్టి?
అ తర్వాత, మంథని ప్రయాణ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించి, ప్రజలకు ఉచితంగా మజ్జిగను అందించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “కార్యకర్తలు, నాయకుల ప్రేమ, అభిమానాలే మాకు స్ఫూర్తి. నేను రాష్ట్రానికి మంత్రి అయినా, ఈ నియోజకవర్గంలో సాధారణ కార్యకర్తగానే ఉంటాను. మా మధ్యలో శ్రీపాదరావు లేకపోయినా, ఆయన స్ఫూర్తితో కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.