IT layoffs put US work visas of Indians at stake: సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే భారతీయులకు ఓ కల. ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయితే లక్షల్లో జీతాలు, ఇక అమెరికాలో ఉద్యోగం అయితే డాలర్లలో సంపాదన. చివరకు తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయిలను ఐటీ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకునేంతగా ఈ ఉద్యోగం భారతీయ సమాజంపై ప్రభావం చూపింది. చాలా మందికి అమెరికా అనేది డ్రీమ్. కానీ ఇప్పుడు ఆ కలలు చెదిరిపోతున్నాయి. ఐటీ అంటేనే భయపడాల్సి వస్తోంది. జాబ్ ఎప్పుడు పోతుందో అని ఐటీ ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
Read Also: USA: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురి మృతి
అమెరికాలో ఉన్న భారతీయుల్లో భయం:
ఇప్పటికే అమెరికాలో కొలువుల నుంచి తీసిపారేస్తున్నాయి ఐటీ దిగ్గజ కంపెనీలు. దీంతో అమెరికాలో జాబ్ లు చేస్తున్న భారతీయుల్లో కలవరం మొదలైంది. చాలా మందిపై లేఆఫ్ కత్తి వేలాడుతోంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందో అని భయం మొదలైంది. చాలా మంది అక్కడ ఈఎంఐలు పెట్టి ఇళ్లు, కార్లను కొనుగోలు చేశారు. ఉన్న పళంగా ఉద్యోగం పోతే ఎలా..? అనే తెగ భయపడుతున్నారు. ఈ లేఆఫ్స్ వల్ల ఐటీ ఉద్యోగులు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దాదాపుగా 800 మంది ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు ఈ గ్రూపులో ఉన్నారు. దీంతో పాటు తమ గ్రీన్ కార్డు ప్రక్రియ కూడా ఇబ్బందుల్లో పడుతుందని భారతీయ ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెచ్-1బీ వీసాదారులపై ప్రభావం:
అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు మూడు నెలల క్రితమే వచ్చిన గీత(పేరుమార్చాం) అమెరికా వచ్చారు. ఈ వారం మార్చి 20న తన చివరి వర్కింగ్ డే అని కంపెనీ చెప్పిందని.. హెచ్ 1బీ వీసాలపై ఉన్న వారి పరిస్థితి మరింత దిగజారుతుందని.. 60 రోజుల్లో కొత్త ఉద్యోగం రాకపోతే తిరిగి భారతదేశానికి రావడం తప్పదని వెల్లడించారు. హెచ్-1బీ వీసాపై ఉన్న ఉద్యోగి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయారు. ఒంటరి తల్లి అయిన ఆమె కుమారుడు కాలేజీలో చేరబోతున్నారు. ఈ పరిస్థితిల్లో సదరు ఉద్యోగి ఉద్యోగాన్ని కోల్పోయింది.
H-1B, L1 నాన్-ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసాలపై భారతీయులు, చైనీయులు అమెరికాలో ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా ప్రమాదంలో పడ్డారు. హెచ్-1బీ వీసాలు ఉన్నవారికి ఒక వేళ ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో మరో ఉద్యోగం సంపాదించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం రాకపోతే.. గడువు ముగిసిన 10 రోజుల్లో అమెరికాను వీడి ఇండియాకు తిరుగి రావాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది భారతీయుల్లో కలవరం మొదలైంది.
Read Also: SpiceJet flight: ఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్‌లో ప్రయాణికుడి గలాటా.. అరెస్ట్ చేసిన పోలీసులు..
ఉద్యోగం పోతున్నవారిలో భారతీయులే అధికం:
ట్విట్టర్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా ఇలా దిగ్గజ కంపెనీలతో పాటు పలు ఐటీ కంపెనీలు ఆర్థికమాంద్యం పేరుతో ఉద్యోగులను తొలగిస్తోంది. ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, గత ఏడాది నవంబర్ నుండి దాదాపు 2,00,000 మంది ఐటి ఉద్యోగులు తొలగించబడ్డారు. నివేదికల ప్రకారం తొలగించబడిన ఉద్యోగుల్లో 30 నుండి 40 శాతం మధ్య భారతీయ ఐటీ నిపుణులే ఉన్నారు. వీరిలో చాలా మంది హెచ్-1బీ వీసాలపై ఉన్నారు.