Site icon NTV Telugu

ISRO Satellite Images: ఈ ఒక్క ఫోటో చాలు.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి!

Isro Uttarkasi

Isro Uttarkasi

ISRO Satellite Images: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో గత వారంలో సంభవించిన క్లౌడ్ బ్రస్ట్ తరవాత అందుకు సంబంధించిన భయానక దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టింది. ఈ విపత్తు కారణంగా ధరాళీ గ్రామం దాదాపు పూర్తిగా నాశనం అయిందని ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది జూన్‌లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భగీరథి నది ఒడ్డున ఇళ్లతో, చిన్న తోటలతో, ఇతర నిర్మాణాలతో ఉన్న ఒక భూభాగం కనిపించింది. కానీ, ఆగస్టు 7న తీసిన రెండో చిత్రంలో ఆ భూభాగం పూర్తిగా నీటితో నిండి అక్కడ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.

HYDRA: ఉద్యోగుల జీతాలపై స్పష్టత.. హైడ్రా కమిషనర్ భరోసా!

ధరాళీ గ్రామం అంతర్భాగంలో ప్రవహించే ఖీర్ గాడ్ అనే ఉపనది కలిసే ప్రాంతం కూడా పూర్తిగా నాశనం అయ్యింది. అక్కడి రహదారులు, ఖీర్ గాడ్‌పై ఉన్న చిన్న వంతెన మొత్తం కొట్టుకుపోయాయి. ఇకపోతే ఆ జిల్లా అధికారులు సోమవారం ఉదయం వరకు దాదాపు 1,300 మందిని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. గఢ్వాల్ కమిషనర్ వినయ్ పాండే ప్రకారం.. ప్రస్తుతం రక్షణ చర్యలు ముగిసాయని, రహదారి అనుసంధానం చాలావరకు పునరుద్ధరించబడిందని ఆయన తెలిపారు. నేటి సాయంత్రానికి పూర్తి రహదారి కనెక్టివిటీ పునరుద్ధరించబడుతుంది. ఆహారం, బట్టలు, అవసరమైన వస్తువులు పంపిణీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని పంపిణీ చేయడానికి జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన తెలిపారు.

Supreme Court: ఆర్మీ తీరుపై సుప్రీం కోర్టు ఫైర్..!

ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదు మరణాలు నమోదయ్యాయి. ఇంకా 43 మంది (వీరిలో తొమ్మిది మంది సైనికులు) కనిపించకుండా పోయారని అధికారులు ధృవీకరించారు. ఇక నేడు ఉదయం కురిసిన వర్షం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ‘యెల్లో’ అలర్ట్ జారీ చేసింది. ఇక అల్మోరా, డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్, పౌరీ, ఉదమ్ సింగ్ నగర్ జిల్లాల్లో తదుపరి గంటల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఏకంగా ‘రెడ్’ అలర్ట్ జారీ చేశారు. రాజధాని డెహ్రాడూన్‌తో పాటు ఇప్పటికే ప్రభావితమైన ఉత్తరకాశీ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది.

Exit mobile version