టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బుధవారం ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే మీడియా ముందుకు వచ్చి అశ్విన్.. తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టులు ఉన్నా.. యాష్ అనుహ్యంగా రిటైర్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్‌మెంట్ ఇవ్వడానికి ఆ ఇద్దరే కారణమని చెప్పొచ్చు.
సిరీస్ మధ్యలోనే ఆర్ అశ్విన్ రిటైర్ కావడానికి మొదటి కారణం సహచర స్పిన్నర్ రవీంద్ర జడేజా అని చెప్పొచ్చు. బ్రిస్బేన్ టెస్టులో జడేజా వలనే టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. 77 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న జడేజాను మెల్‌బోర్న్, సిడ్నీలో జరిగే టెస్టుల్లో పక్కనపెట్టే అవకాశం లేదు. మరోవైపు మెల్‌బోర్న్, సిడ్నీ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయనే అంచనాలున్నాయి కాబట్టి.. రెండో స్పిన్నర్‌గా బ్యాటింగ్ చేసే వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో చోటు దక్కడం కష్టమని బావించిన అశ్విన్.. రిటైర్‌మెంట్ ప్రకటించి ఉంటాడని విశ్లేషకులు బావిస్తున్నారు.
న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్‌గా రాణించాడు. దాంతో ఆస్ట్రేలియా టూర్‌కు బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. ఆర్ అశ్విన్‌తో పోలిస్తే సుందర్ బాగా బ్యాటింగ్ చేయగలడు. యాష్ కెరీర్ చరమాంకంలో ఉండడంతో.. టీమిండియా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సుందర్‌కు అవకాశాలు ఇస్తోంది. యాష్ స్థానాన్ని సుందర్‌తో భర్తీ చేయాలనేది బీసీసీఐ ఆలోచన. ఇప్పటికే వన్డే, టీ20ల తుది జట్టులో యాష్ ఉండడం లేదు. ఇప్పుడు టెస్టుల్లో కూడా అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు ఇప్పట్లో భారత జట్టుకు టెస్టు సిరీస్‌లు లేవు. ఇవన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అశ్విన్ భారత్ తరఫున 106 టెస్టుల్లో 537, 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 3503 పరుగులు చేసిన యాష్.. 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు బాదాడు.