ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేట్ ప్రమోషన్ విషయంలో లైట్‌గా ఉంటున్నారా?.. పథకాల ప్రారంభోత్సవాల్లో చురుగ్గా పాల్గొంటున్న పవన్ పెట్టుబడుల సదస్సు, పరిశ్రమల ఏర్పాటు లాంటి కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు?.. ఆయన దూరంగా ఉంటున్నారా? లేక దూరం పెడుతున్నారా?.. ఆ విషయమై కూటమి సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు అవుతోంది. ఓవైపు పథకాల అమలు, పెట్టుబడుల ఆకర్షణలో బిజీగా ఉంటూనే… మరోవైపు మూడు పార్టీల మధ్య ఎన్నికల నాటి మూడ్‌ని కొనసాగించడానికే ప్రయత్నిస్తున్నారు అగ్ర నాయకులు.కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన కింది స్థాయి నాయకుల మధ్య ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ.. పార్టీల పెద్దలు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సెట్ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా…పెట్టుబడుల కోసం ప్రమోషన్,పరిశ్రమల ఏర్పాటు విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉన్నంత యాక్టివ్‌గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు ఉండటంలేదన్న చర్చ జరుగుతోందట కూటమి వర్గాల్లో. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి, లోకేష్ ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఇతర దేశాల్లో తిరిగి పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నారని, తనకు సంబంధం లేని శాఖల విషయంలో పవన్ ఎలా జోక్యం చేసుకుంటారన్న ప్రశ్నలు వస్తున్నా…వాటికి జనసేనలోనే కొందమంది నాయకులు కన్విన్స్ అవడం లేదట. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇప్పుడు ఇలా సైలెంట్ అవడం గ్లాస్ పార్టీలోనే కొందరికి మింగుడు పడటం లేదట. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల విషయంలో పవన్ కళ్యాణ్‌కు నేరుగా సంబంధం లేనప్పటికీ… ప్రభుత్వంలో ఆయనకు ఉన్న ప్రాధాన్యం, పోషిస్తున్న కీలక పాత్ర దృష్ట్యా కనీసం వాటికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో సైతం ఎందుకు పాల్గొనడం లేదన్నది ప్రధానంగా వస్తున్న డౌట్ అట.
మొన్నటికి మొన్న వైజాగ్ వేదికగా రెండు రోజులు పాటు జరిగిన CII సదస్సులో పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంపై రాజకీయంగా పెద్ద చర్చే నడుస్తోంది. అలాగే ఢిల్లీలో జరిగిన గూగుల్ డేటా సెంటర్ ప్రోగ్రామ్‌లో కూడా పవన్ పాల్గొనలేదు. ఈ రెండిటికీ ఆయన హాజరై ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం జనసేన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. కొన్ని చరిత్రాత్మక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచే కార్యక్రమాలకు ప్రభుత్వంలో కీలకంగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి హాజరవకపోవడంపై కొంతమందికి అనుమానాలు కలుగుతున్నాయి. పవన్‌కళ్యాణ్ తనకు తానుగా… ఈ పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు లాంటి వాటికి దూరంగా ఉంటున్నారా? లేక ప్రభుత్వమే ఆయన్ని పక్కన పెడుతోందా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయట. వాస్తవానికి..మొదచ్లో బాగా యాక్టివ్‌గానే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి. తల్లికి వందనం కార్యక్రమం, మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం, ఆటో డ్రైవర్లకు 15 వేలు ఇచ్చిన కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ యాక్టివ్‌గానే పాల్గొన్నారు. ఆయా సందర్భఆల్లో చంద్రబాబు, లోకేష్ కూడా ఆయనకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. కానీ పథకాల విషయంలో యాక్టివ్‌గా ఉన్న పవన్…స్టేట్‌ని ప్రమోట్ చేసే విషయంలో మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
Also Read: Off The Record: ఆ ఒక్క కోరిక తీరిస్తే చాలు.. అధిష్టానంతో యనమల బేరాలు!
అదే సమయంలో ఆయన పవన్ బ్రాండ్ ఇమేజ్‌ని పథకాల వరకే పరిమితం చేస్తున్నారా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి కొంతమందిలో. పవన్‌కు ఉన్న ఇమేజ్‌ని బయట కూడా ఉపయోగించుకుంటే… రాష్ట్రానికి మరింత పెట్టుబడుల ఆకర్షణ ఉంటుందన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలోనే.. విశాఖ వేదికగా జరిగిన పెట్టుబడుల సదస్సులో పవన్ కళ్యాణ్ ఎందుకు పాల్గొనలేదంటూ… వైసీపీ ప్రశ్నిస్తోంది. చంద్రబాబు, లోకేష్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పేరుతో తమను తాము ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారని, ఆ విషయం తెలిసే పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా ఉంటున్నారన్నది ప్రతిపక్షం విశ్లేషణ. ఆ సంగతి ఎలా ఉన్నా…. ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్న విశాఖ సదస్సు, ఉపరాష్ట్రపతి చీఫ్ గా వచ్చిన కార్యక్రమంలో.. ప్రోటోకాల్ ప్రకారమైనా… పవన్ హాజరు కావాలి కదా అని అడుగుతున్నారు కొందరు. కేవలం ప్రధాని వచ్చే సభలకు మాత్రమే హాజరవుతున్న డిప్యూటీ సీఎం…. అన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగే ఈవెంట్‌కు ఎందుకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నకు జనసేన నుండి కానీ మొత్తం కూటమి వైపు నుంచిగానీ స్పష్టమైన సమాధానం రావడం లేదు.జనసేన కార్యకర్తలతోపాటు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ చర్చకు జనసేనాని నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.